గాంధీలో మూడ్రోజుల ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు సమ్మె విరమిస్తున్నట్లు జూనియర్ వైద్యులు ప్రకటించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటలతో రెండు దఫా చర్చల అనంతరం వైద్యులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మంగళవారం సాయంత్రం గాంధీలో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగి చనిపోవటం వల్ల గొడవ ప్రారంభమైంది. మృతుని కుటుంబీకులు విధుల్లో ఉన్న జూనియర్ వైద్యుడిని కుర్చీలతో కొట్టడం వల్ల జూడాలు ఆగ్రహించారు.
మూడు నెలలపాటు కష్టపడి కరోనా రోగులకు చికిత్స అందించిన తమపై ఇలాంటి దాడులు అమానుషమంటూ జూడాలు సమ్మెకు దిగారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి గాంధీలో చికిత్సలు తీసుకుంటున్న వారికి ఇబ్బందులు తప్పలేదు. బుధవారం సైతం జూడాలు రోడ్డెక్కి నిరసన గళాలు వినిపించారు. ఏకంగా మంత్రే దిగివచ్చి చర్చలకు రమ్మన్నా... జూడాలు సమ్మె విరమించలేదు. మంత్రి ఈటల స్వయంగా గాంధీ ఆసుపత్రికి వచ్చి జూడాలతో చర్చలు జరిపారు. అప్పటికీ వారు సంతృప్తి చెందక.. గురువారం కూడా సమ్మెను కొనసాగించారు.
గురువారం రాత్రి మంత్రి ఈటల మరోసారి భేటీ అయి చర్చించగా జూడాలు సంతృప్తి చెందారు. ప్రజారోగ్యం, మంత్రి హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. జూడాలు మంత్రికి ప్రధానంగా ఐదు డిమాండ్లను వినిపించగా అన్నింటికి ఈటల సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు.
మంత్రి ఈటల సానుకూలంగా స్పందించిన జూడాల డిమాండ్లు ఇవే..
- గాంధీ సహా ఇతర ప్రాంతాల్లో కరోనా చికిత్సలు ఇవ్వాలన్న డిమాండ్‌కు మంత్రి సానుకూలత
- గాంధీలో ఇతర స్పెషాలిటీ చికిత్సల పునరుద్ధరణపై కేబినెట్లో చర్చిస్తానన్న ఈటల
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా ఎస్పీఎఫ్ బలగాలు అందుబాటులో ఉంచుతామని మంత్రి హామీ
- ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిని రిక్రూట్ చేయడమే గాక.. 30 శాతం అదనపు సిబ్బంది ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
- జూడాలతో చర్చించాకే పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కుల ఆర్డర్‌కు అంగీకారం
- 15 రోజులకోసారి జూడా కమిటీలతో చర్చలకు సిద్ధమని మంత్రి ఈటల ప్రకటన
వారి డిమాండ్లకు మంత్రి ఈటల సానుకూలంగా స్పందించడం వల్ల తక్షణం విధుల్లో చేరుతున్నట్లు జూడాలు ప్రకటించారు. మూడ్రోజుల అనంతరం గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు.