అప్పులు తీసుకున్న రైతులు తిరిగికట్టలేదని వారిని ఎగవేతదారుల జాబితా చేర్చి ఆస్తుల వేలానికి నోటీసులిస్తున్నాయి బ్యాంకులు. పలు గ్రామాల్లో సహకార బ్యాంకుల సిబ్బంది ఇళ్లకు వచ్చి సామాన్లను బలవంతంగా తీసుకెళుతుండటంతో పరువు పోతోందని బాధిత రైతు కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. పాత ఉమ్మడి జిల్లాల కేంద్రాలుగా ‘జిల్లా సహకార కేంద్ర సహకార బ్యాంకు’(డీసీసీబీ)లున్నాయి. ప్రతిబ్యాంకు పరిధిలో దాదాపు సగం ఖాతాలు అప్పుల ఊబిలోనే ఉన్నట్లు బ్యాంకు అధికారులే చెబుతున్నారు. ఉదాహరణకు నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని ఒక వాణిజ్య బ్యాంకులో 650 మంది రైతులను ఎన్‌పీఏలో చేర్చారు.
ఆదాయం లేకనే..
రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేకపోతున్నారు. గత రెండేళ్లుగా అధిక వర్షాలు, తెగుళ్లతో దిగుబడులు సరిగా రాలేదు. పండిన పంటలకు సరైన ధరల్లేక ఆదాయమూ పెరగలేదు. సాధారణంగా బ్యాంకులు స్వల్పకాలిక పంటరుణంతోపాటు వ్యవసాయ సంబంధ సామగ్రి కొనుగోలుకు దీర్ఘకాలిక రుణం కూడా ఇస్తున్నాయి. ఈ రుణం కట్టడానికి మూడేళ్ల వరకూ గడువు ఉంటుంది. ఆదాయం పెరగని కారణంగా అన్నదాతలు స్వల్పకాలిక పంట రుణాలే కట్టలేకపోతున్నారు. దీర్ఘకాలిక రుణాలు చెల్లించేందుకు సొమ్ము దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఆవేదనతో పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
స్వల్పకాలిక పంటరుణం తీసుకున్న తేదీ నుంచి సరిగ్గా ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే కేవలం 4 శాతం మాత్రమే వడ్డీ పడుతుంది. ఏడాది గడువు దాటితే బ్యాంకు 10 శాతం వడ్డీ వేస్తుంది. రాష్ట్రంలో స్వల్పకాలిక పంటరుణాలు తీసుకున్న వారిలోనే సగానికి సగం మంది ఏడాదిలోపు కట్టలేక 6 శాతం వడ్డీ రాయితీని పొందలేకపోతున్నారు. ఇక దీర్ఘకాలిక రుణం తీసుకున్నవారు కట్టడం చాలా తక్కువగా ఉంటోందని బ్యాంకు మేనేజర్ ఒకరు వివరించారు. రుణమాఫీ పథకం వల్ల కూడా రుణాలు తిరిగి చెల్లించాలనే తపన రైతుల్లో తగ్గినట్లు ఆయన వివరించారు. ‘ప్రతి ఎన్నికలప్పుడు అన్ని పార్టీలు రుణమాఫీ చేస్తామనే హామీలిస్తున్నాయి. దీంతో బాకీ తిరిగి చెల్లించడం ఎందుకనే భావనలో రైతులు ఉండిపోతున్నారు. ఇది కూడా వారిపై వడ్డీ భారం పెరిగేందుకు కారణమవుతోందని’ కల్వకుర్తి బ్యాంకు సిబ్బంది ‘ఈనాడు’కు చెప్పారు.
బాకీలు కట్టేందుకు ముందుకు రాకపోవడంతోనే..
ఎవరైనా రైతు దీర్ఘకాలిక రుణం తీసుకుని మూడేళ్లలోగా తిరిగి చెల్లించకపోతే ఆస్తుల వేలం నోటీసులిస్తున్నట్లు సహకార బ్యాంకు అధికారులు చెబుతున్నారు. బాకీ కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని చెబుతున్నా బకాయిదారులు ముందుకు రావడం లేదని అక్కడి బ్యాంకు మేనేజర్ ‘ఈనాడు’కు చెప్పారు. బాకీ కట్టని వారికి నోటీసులిస్తున్న మాట వాస్తవమేనని ఖమ్మం డీసీసీబీ సీఈఓ వీరబాబు ‘ఈనాడు’కు చెప్పారు. తీసుకున్న రుణాలు తిరిగి కట్టకపోతే కొత్తరుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు ఇబ్బంది అవుతుందని రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ నేతి మురళీధర్ స్పష్టం చేశారు.