ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి తొలిదశలో 64 విమానాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులతో కువైట్ నుంచి తొలి విమానం హైదరాబాద్‌కు రానుంది. అమెరికా, బ్రిటన్, మలేసియా, కువైట్, యూఏఈ, ఫిలిప్పీన్స్ నుంచి వారం వ్యవధిలో 8 విమానాల్లో సుమారు 2 వేల మంది వరకు హైదరాబాద్‌కు రానున్నారు. వాస్తవానికి తొలి విమానం అమెరికా నుంచి రావాల్సి ఉండగా అది రద్దయింది.
విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారిని నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించనున్నారు. ఇందుకోసం హోటళ్లు, లాడ్జీల్లో ఏర్పాట్లు చేశారు. రూ.5 వేలు, రూ.15 వేలు, రూ.30 వేలు ప్యాకేజీల చొప్పున వసతి ప్యాకేజీలు నిర్ణయించారు. ఆ ఖర్చులను ప్రయాణికులే భరించాలి. పేదకార్మికులైతే ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తారు. ఇలా వచ్చే వారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఏర్పాట్ల పర్యవేక్షణకు ఆరు కమిటీలు
విమానాల్లో వచ్చే వారి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు కమిటీలను నియమించింది. వీటికి సాధారణ పరిపాలనలోని ప్రొటోకాల్ విభాగ సంయుక్త కార్యదర్శి ఎస్.అర్వింద్ సింగ్‌ను నోడల్ అధికారిగా ప్రభుత్వం నియమించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఇమిగ్రేషన్, క్వారంటైన్ వ్యవహారాల వరకు ఈయన పర్యవేక్షిస్తారు.