ఏపీలోని గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రి(జీజీహెచ్)లో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కొవిడ్ రోగులుండే రెండో అంతస్తులోని ఐసీయూ వార్డులో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం సమయంలో మూడు వేర్వేరు వార్డుల్లో 15మంది కొవిడ్ రోగులు, ఐదుగురు డయాలసిస్ రోగులు చికిత్స పొందుతున్నారు. సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. రోగులను హుఠాహుఠిన వేరే వార్డులకు తరలించారు. ఆక్సిజన్ పైపులు మాడిపోగా... వెంటనే వేరే వార్డులోకి చేర్చి ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించారు.
ఘటనా స్థలిని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, ఎమ్మెల్యే షేక్ ముస్తఫా, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి పరిశీలించారు. రోగులంతా సురక్షితంగా ఉన్నారని, సిబ్బంది సకాలంలో స్పందించారని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.