జీహెచ్ఎంసీతో పాటు గ్రేటర్ వరంగల్, ఇతర పట్టణ ప్రాంతాల్లో గుర్తించిన వారిలో మిగిలిన వారికి రానున్న నాలుగు రోజుల్లో కొవిడ్ టీకాలు ఇవ్వాలని అధికారులను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ అధికారులతో బీఆర్కే భవన్లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌పై చర్చించారు.
మరికొన్ని వర్గాలను గుర్తించి..
టీకాల కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని అధికారులకు హరీశ్ రావు స్పష్టం చేశారు. రానున్న నాలుగు రోజుల్లో మరో పది లక్షల మందికి టీకాలు వేయాలని సూచించారు. ప్రాధాన్యంగా టీకాలు వేయాల్సిన మరికొన్ని వర్గాలను గుర్తించి అందుకు అనుగుణంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వీరికి టీకాలు..
డయాలసిస్, తలసేమియా రోగులు, పట్టణ ప్రాంతాల్లోని ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఇంజినీరింగ్ శాఖల్లోని సిబ్బంది, విద్యుత్, వ్యవసాయ, రెవెన్యు సంబంధిత శాఖల క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు, ఐకేపీ సిబ్బంది, బ్యాంకులు, తపాలా ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పూజారులు, ఇమాంలు, చర్చి పాస్టర్లు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు ప్రాధాన్యక్రమంలో టీకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
జయేశ్‌రంజన్‌కు బాధ్యతలు..
16 లక్షల డోసుల కొనుగోలుకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి చెల్లింపులు చేసినందున ఆయా కంపెనీల నుంచి టీకాలు త్వరగా వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్‌రంజన్‌ను నియమించారు.
ఇదీచూడండి:కరోనా తగ్గిపోయాక చికిత్స గరిష్ఠ ధరలు ఖరారు చేస్తారా..?: హైకోర్టు