సాగు పనులకు సన్నద్ధమయ్యే సమయంలో రైతులు..... పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, జనగామ కొడకండ్ల దేవరుప్పుల, బచ్చన్నపేట, నర్మెట్ట, పాలకుర్తి, తరిగొప్పుల మండలాల్లో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2.86 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా... 2.33 లక్షల మెట్రిక్ టన్నుల మేర కొనుగోళ్లు పూర్తయ్యాయి. లారీల కొరత కారణంగా ధాన్యం సేకరణకు ఆటంకం కలుగుతోంది. ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురంలో.... వర్షాలకు ధాన్యానికి మొలకలు వస్తున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. చాలా చోట్ల తూకం వేసిన ధాన్యం బస్తాలను పదిహేను రోజులైనా కేంద్రాల నుంచి తరలించడం లేదు. కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్న అన్నదాతలు త్వరగా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని వేడుకుంటున్నారు.
ధాన్యం అమ్మేందుకు రైతుల అవస్థలు.. రోజుల తరబడి పడిగాపులు - ధాన్యం అమ్మేందుకు రైతుల అవస్థలు
రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. వానలు కురవడంతో కొనుగోళ్లు కేంద్రాల్లో కుప్పలుగా పోసిన వరి ధాన్యానికి.... మొలకలు వస్తున్నాయి. కష్టపడి పండించిన పంటను కాపాడుకునేందుకు... రాశులవద్దనే రైతులు పడిగాపులు కాస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేశామన్న మంత్రి గంగుల కమలాకర్....కొన్ని జిల్లాల్లో కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి....ధాన్యం సేకరణ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. తడిసినా ప్రతి గింజా కొంటామని... రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..అధికారులను హెచ్చరించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. రెండు రోజుల్లో సేకరణ పూర్తిచేయాలని ఆదేశించారు.