తెలంగాణ

telangana

ETV Bharat / city

'అమరావతే రాజధానిగా ఉండాలి.. అంతవరకూ ఆందోళనలే..!' - farmers agitations in ap

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ ఏపీ రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో... నిరసన తెలుపుతున్నారు.  రాజధాని గ్రామాల ప్రజల ఆందోళనను రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలిచేందుకు త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి ప్రకటించింది. తమ గోడును ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

amaravathi
'అమరావతే రాజధానిగా ఉండాలి.. అంతవరకూ ఆందోళనలే..!'

By

Published : Dec 29, 2019, 8:01 AM IST

'అమరావతే రాజధానిగా ఉండాలి.. అంతవరకూ ఆందోళనలే..!'

రాజధాని అంశంపై ఏపీ ప్రభుత్వం ఎన్ని వాయిదాలు వేసినా కదిలేది లేదని.. అమరావతి ప్రాంత రైతులు స్పష్టం చేశారు. కమిటీల మాటను మరిచి అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ రైతులు, కూలీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మంగళగిరి, తాడికొండ, తుళ్లూరు, మందడంలో మహాధర్నాలు, వెలగపూడిలో రిలే దీక్షలు నిర్వహించారు. తుళ్లూరులో మోకాళ్లపై నించొని మహిళలు, రైతులు నిరసన తెలిపారు. నవులూరు, కృష్ణాయపాలెంలో రైతులు... నిరాహార దీక్ష చేశారు. పెనుమాక, ఎర్రబాలెంలో రహదారిపై బైఠాయించి... నిరసన తెలిపారు. సీపీఎం, కాంగ్రెస్ నేతలు వారికి సంఘీభావం తెలిపారు.

సర్కారు స్పష్టత ఇవ్వాలి

అమరావతిని రక్షించాలి... ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలని నినాదంతో తాము చేస్తోన్న ఆందోళనలు... ప్రభుత్వం నుంచి సుస్పష్టమైన నిర్ణయం వచ్చేంత వరకు కొనసాగుతాయని అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు ప్రకటించారు. మూడు రాజధానుల ఆలోచన పూర్తిగా అర్ధరహితమైన చర్య అని... ఇది విభజించి పాలించు నిర్ణయానికి ఊతమిస్తుందన్నారు. అమరావతి అంశం 29 గ్రామాల రైతుల సమస్య కాదని- మొత్తం రాష్ట్రాభివృద్ధితో ముడిపడిన వ్యవహారమన్నారు.

గుంటూరు, కృష్ణాల్లోనూ ఆందోళనలు

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గుంటూరు, కృష్ణా సహా పలు జిల్లాల్లో నిరసనలు కొనసాగాయి. రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జ్ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. తెనాలిలో రాజకీయ, రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని అనంతపురం జిల్లా కదిరిలో అఖిలపక్షం డిమాండ్ చేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: చలి చంపేస్తోంది.. రాష్ట్రం వణుకుతోంది.!

ABOUT THE AUTHOR

...view details