తెలంగాణ

telangana

ETV Bharat / city

అన్నదాత అరిగోస.. అకాల వర్షాలకు తడిసిపోతున్న వడ్లు - అకాల వర్షాలు

గతేడాది ఇదే సమయానికి 8 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈ ఏడాది ఇప్పటి వరకు 2 లక్షల టన్నులే కొన్నారు. మరోపక్క కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్‌లు లేకపోవడంతో రూ.600-750కు అద్దెకు తీసుకుని రైతన్నలు అగచాట్లు పడుతున్నారు.

Farmers facing problems at paddy procurement centers due to unwanted rains
Farmers facing problems at paddy procurement centers due to unwanted rains

By

Published : May 2, 2022, 4:55 AM IST

ఆరుగాలం కష్టపడి సాగుచేసి ధాన్యాన్ని అమ్మడానికి తెచ్చిన రైతులపై సమస్యల వర్షం కురుస్తోంది. కొనుగోలు కేంద్రాలు త్వరగా ప్రారంభించకపోవడం, ఆరంభించిన చోట కూడా వేగంగా కొనుగోలు చేయక పోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క అకాల వర్షాలకు పాడవుతున్న వడ్లను చూస్తూ దిగాలు చెందుతున్నారు. రాష్ట్రంలో వారం రోజులుగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సోమ, మంగళ వారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశాలున్నాయని, ఆ సమయంలో 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ తాజాగా తెలిపింది. వర్షాలకు తడవకుండా ధాన్యాన్ని కాపాడుకునేందుకు కొనుగోలు కేంద్రాల వద్దనే రైతులు వారం, 10 రోజులుగా పడిగాపులు పడుతున్నారు. మరోవైపు వర్షాలు లేని ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు వీస్తున్నాయి. కొందరు రైతులు వడదెబ్బ తగిలి అనారోగ్యానికి గురవుతున్నారు. అయినా ధాన్యం కొనుగోళ్లు ఏ మాత్రం పెంచకుండా అధికారులు నింపాదిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సదుపాయాలేవీ...

  • రాష్ట్రంలో మొత్తం 6,900 కొనుగోలు కేంద్రాలు గ్రామగ్రామానా తెరిచి ధాన్యం కొనాలని ప్రభుత్వం పక్షం రోజుల క్రితమే ఆదేశించింది. ఇంతవరకూ 3,500 కేంద్రాలే తెరిచారు. కొన్ని గ్రామాల్లో తెరిచినా హమాలీలు లేరని, గోతాలు రాలేదని, టార్పాలిన్లు లేవని ధాన్యం కొనడమే ప్రారంభించలేదు. పలు గ్రామాల్లో వారం, పదిరోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు వాపోయారు.
  • హమాలీల కొరత వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూకం వేయడానికి ఆలస్యమవుతుందని మెదక్‌ జిల్లా వెల్దుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) ముఖ్య కార్వనిర్వహణాధికారి (సీఈఓ) సిద్దయ్య ‘ఈనాడు’కు తెలిపారు. బిహార్‌ రాష్ట్రానికి చెందిన హమాలీలు ఒకట్రెండు రోజుల్లో వస్తారని, వారు రాగానే వడ్ల తూకం ప్రారంభించి కొంటామని ఆయన వివరించారు.
  • జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలంలోని విశ్వనాథపురం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సదుపాయాలు లేక రైతులకు అవస్థలు తప్పడం లేదు. వర్షాలకు ధాన్యం తడిసిపోక ముందే కొనుగోలు చేయాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు.

మెదక్‌ ఎదుల్లాపూర్‌, గుండ్లపల్లి గ్రామాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాలకు గోనెసంచులు రాలేదు. టార్పాలిన్లు సరిపోయినన్ని ఇవ్వలేదు. వర్షం వస్తే ధాన్యాన్ని కాపాడేందుకు రోజుకు రూ.వందలకు వందలు అద్దెలు చెల్లించి రైతులు టార్పాలిన్లు తెచ్చుకుంటున్నారు. పట్టాలు, తూకం యంత్రాలు, తేమ కొలిచే, ధాన్యం శుభ్రం చేసే యంత్రాలు కొని పంపాలని జిల్లా అధికారులు తాపీగా ఇప్పుడు మార్కెటింగ్‌శాఖకు ప్రతిపాదనలు పంపుతున్నారు. ఈ శాఖ వీటి కొనుగోలు బాధ్యతను రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ(ఆగ్రోస్‌)కు అప్పగించింది. ఈ సంస్థ ఈ యంత్రాలను పంజాబ్‌, హరియాణాల నుంచి తెప్పించేందుకు ఇప్పుడు యత్నాలు చేస్తోంది. అవి వచ్చేది ఎప్పుడు, గ్రామాలకు చేరేది ఎన్నడు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనేది ఎప్పుడో తెలియక రైతులు దిక్కులు చూస్తున్నారు.

"నాకున్న ఎకరా భూమిలో వరి సాగుచేశా.10 రోజుల క్రితం వరి పంట కోసి వడ్లు తెచ్చి రోడ్డుపై పోసి ఆరబెట్టా. గోతాలు, టార్పాలిన్లు ఇవ్వడం లేదు. వర్షానికి ధాన్యం తడిసి పాడైంది. మళ్లీ ఆరబోశా. హమాలీలు లేక చెన్నాపూర్‌లో కొనడం లేదు."-మరకంటి శంకరయ్య, చెన్నాపూర్‌, మెదక్‌ జిల్లా

"మూడెకరాల్లో వరి సాగు చేశా. 8 రోజుల క్రితం కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసే స్థలంలో ధాన్యం ఆరబోశా. ఇంతవరకూ కేంద్రాన్ని ప్రారంభించలేదు. రోజుకు రూ.750 చొప్పున అద్దె చెల్లించి టార్పాలిన్లు తీసుకుని వడ్లపై కప్పి ఉంచా. 4 రోజుల క్రితం వర్షం పడటంతో ధాన్యం తడిసింది. మళ్లీ ఆరబెట్టడానికి అదనంగా కూలీల ఖర్చయింది." -బసవన్నగారి ఆంజనేయులు, చండి గ్రామం, మెదక్‌ జిల్లా

"ప్రస్తుత యాసంగిలో 6 ఎకరాల్లో వరి సాగుచేశా. ఎకరానికి రూ.15 వేలకు పైగా పెట్టుబడి పెట్టా. ఎకరాకి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వారం క్రితం వరి కోత కోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చినా ఇంతవరకూ కొనలేదు. వర్షానికి వడ్లు పూర్తిగా పాడయ్యాయి." -పెద్దగొల్ల నర్సింహులు, దౌలాపూర్‌, సంగారెడ్డి జిల్లా

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details