హైదరాబాద్ కరోనా హబ్‌గా మారిందని మాజీ మంత్రి, భాజపా నేత డీకే అరుణ ఆరోపించారు. కేసీఆర్‌కు ఈటల రాజేందర్ మీద ఉన్న కోపమే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు శాపమైందన్నారు. ఓనర్లు, క్లీనర్ల పంచాయితీలో కొవిడ్‌ను అడ్డం పెట్టుకుని తెరాస చేస్తున్న శవ రాజకీయాలతో ప్రజలు బలిపశువులు అవుతున్నారని డీకే అరుణ పేర్కొన్నారు. లక్షల్లో ఖర్చయ్యే కరోనా చికిత్స ఖర్చును పేద, మధ్య తరగతి ప్రజలు ఎలా భరిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచి ప్రజల ప్రాణాలను కాపాడాలన్నారు.
కరోనాపై మంత్రికి వాస్తవాలు తెలిసినా... సీఎంను ప్రశ్నించలేక పోతున్నాడని, తన పదవిని కాపాడుకునే పనిలో భాగంగా భాజపాపై విమర్శలు చేస్తూ.... కేసీఆర్ మెప్పు పొందే ప్రయత్నం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈటల రాజేందర్ డమ్మీ మంత్రిగా మారారని విమర్శించారు.