వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ సిద్ధమవుతోంది. ఈ నెల మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సహజంగానే నీటిపారుదలశాఖకు బడ్జెట్లో మరోసారి కేటాయింపులు భారీగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులు కొనసాగుతున్న ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారు. సీతారామ, పాలమూరు - రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయకట్టుకు నీరివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులు, ఇంజినీర్లకు లక్ష్యం నిర్దేశించారు.
రుణాల ద్వారా
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి, డిండి పనులను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు పనులు కూడా వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రాజెక్టులకు నిధులు ఆగవద్దన్న సీఎం... బడ్జెట్లోనూ నిధులు కేటాయిస్తామని తెలిపారు. అందుకు అనుగుణంగా 2021-22 బడ్జెట్లో ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించనున్నారు. బడ్జెట్ నిధులతో పాటు వివిధ ఆర్థికసంస్థల నుంచి రుణాల ద్వారా కూడా ఈ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చనున్నారు.
నిర్వహణపై ప్రత్యేక దృష్టి
ప్రాజెక్టుల నిర్వహణకు ఈ మారు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తి కాగా నీటి ఎత్తిపోత కూడా కొనసాగుతోంది. మిగతా చోట్ల కూడా నీటిని చెరువులకు, పంట పొలాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. నీటిపారుదలశాఖ పునర్వ్యవస్థీకరణలోనూ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు ప్రాధాన్యం ఇచ్చారు. అందుకు అనుగుణంగా బడ్జెట్లోనూ నిధులు కేటాయించునున్నారు.
వాటి కోసం ప్రత్యేక కేటాయింపులు
పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఇంజినీర్లకు ఆర్థికాధికారాలు ఇచ్చారు. దిగువ స్థాయి ఇంజినీర్ మొదలు ఇంజినీర్ ఇన్ చీఫ్ వరకు పనులు మంజూరు చేసే అధికారాన్ని అప్పగించారు. తక్షణం చేయాల్సిన పనులు, మరమ్మతుల కోసం ఈ వెసులుబాటు కల్పించారు. గరిష్ఠంగా ఎన్ఈసీ ఐదు కోట్ల రూపాయల వరకు పనులు మంజూరు చేసే అధికారం ఉంది. ఇందుకోసం బడ్జెట్లో రూ.280 కోట్లు కేటాయిస్తారని సమాచారం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకొని అందుకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి:ఈ నెల 4న యాదాద్రిని సందర్శించనున్న సీఎం