గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో సమావేశమైంది. గుర్తింపు పొందిన 11 పార్టీల ప్రతినిధులతో కమిషనర్ పార్థసారధి విడివిడిగా సమావేశమయ్యారు. వార్డుల వారీ ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఖరారు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అభ్యర్థుల వ్యయం, తదితర అంశాలపై చర్చించారు. ఆయా అంశాలపై పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని కమిషనర్ చెప్పారు.
ఎన్నికల సంఘం తీసుకునే చర్యలు బాగున్నాయని తెరాస ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అభ్యర్థుల ఖర్చులు పెంచాలని తామే కోరినట్టు తెలిపారు. దివ్యాంగులకు కొవిడ్ రోగులకు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరారు. సోషల్ మీడియా కట్టడి కోసం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని తెరాస ప్రధాన కార్యదర్శి భరత్ పేర్కొన్నారు. కార్పొరేషన్‌లో ఉన్న అధికారులు నాయకులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని భాజపా నేత చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. దుబ్బాకలో పనిచేసిన పోలీసులు కాకుండా కేంద్ర బలగాలు ఇతర రాష్ట్రాల పోలీసులను తీసుకురావాలన్నారు.