తెలంగాణ

telangana

ETV Bharat / city

80ఏళ్ల వయసులో బామ్మ సేద్యం... కౌలు భూమిలో ప్రకృతి వ్యవసాయం - సేంద్రియ వ్యవసాయం చేస్తున్న వృద్ధురాలు

ఎనిమిది పదుల వయసులోనూ ఓ వృద్ధురాలు.. దుక్కిదున్ని.. సిరులపంట పండిస్తున్నారు. సేంద్రియ సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించడమే కాకుండా.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమాజానికి అందిస్తున్నారు. వ్వవసాయశాఖ చేపట్టిన జీరో బడ్జెట్ వ్యవసాయ విభాగానికి ప్రచారకర్తగా వ్యవహారిస్తున్నారు సీతారామపురం సరోజిని.

farming
farming

By

Published : Jun 28, 2020, 9:44 AM IST

సరోజినమ్మ సేద్యం... కౌలు భూమిలో ప్రకృతి వ్యవసాయం

కృష్ణ జిల్లా నూజివీడు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన సరోజిని.. పశ్చిమ గోదావరిజిల్లా పెదపాడు మండలం ఏపూరులో వ్యవసాయం చేస్తున్నారు. పొలాన్ని కౌలుకు తీసుకొని.. వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 80 ఏళ్ల వయసులోనూ సేంద్రియ సాగుపై మక్కువతో.. సొంత పొలం లేకపోయినా.. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. కుమారుడు, మనవడు, మనవరాలు సాయంతో ప్రకృతి సేద్యాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. సరోజిని సేద్యపు పద్ధతులు గమనించిన పశ్చిమగోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు... తమ విభాగంలో ప్రచారకర్తగా చేరి.. రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా ఏపీ అంతటా పర్యటిస్తూ.. సేంద్రియ సేద్యంపై సరోజిని ప్రచారం చేస్తున్నారు. రైతు సదస్సుల్లో పాల్గొంటూ ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తున్నారు.

అంతర పంటలుగా కూరగాయలు...

వయసు మీదపడుతున్నా.. కుటుంబసభ్యుల సాయంతో ఓ వైపు సేంద్రియ సాగు చేస్తూ... మరోవైపు రైతుల్లో సరోజిని అవగాహన కల్పిస్తున్నారు. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన సేంద్రియసాగును కొనసాగిస్తానని ఆమె చెబుతున్నారు. ఏపూరులో కౌలుకు చేస్తున్న బామ్మ... జామ తోటలో అంతర పంటలుగా కూరగాయాలు సాగుచేస్తున్నారు. వరి, వేరుశనగ వంటి పంటలు సాగుచేస్తూ.. సేంద్రియ వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

సొంత పొలం ఉన్న వారే సేంద్రియ సేద్యం చేసేందుకు ధైర్యం చేయరు.. అలాంటిది కౌలుపొలంలో ప్రకృతి సేద్యాన్ని అద్భుతంగా చేస్తున్నారు సరోజిని బామ్మ. పంటల దిగుబడి ఆలస్యంగా వస్తుందన్న కారణంతో కౌలుదారులు ప్రకృతి సేద్యం చేయడానికి వెనకాడతారు. కానీ ఈమె కౌలుకు చేస్తూనే అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

బామ్మ పట్టుదలను చూసిన భూయజమానులు పొలాన్ని వేరేవాళ్లకు ఇవ్వలేదు. పదేళ్లుగా ఒకే పొలాన్ని సరోజిని కౌలుకు చేస్తున్నారు. ప్రారంభంలో జామ తోట సాగుచేశారు. జామలో అంతరపంటగా కూరగాయలు పండిస్తున్నారు. జామకు ఆశాజనకంగా ధరలులేని సమయంలో కూరగాయాల సాగు ఆదుకుంటుందని బామ్మ అంటున్నారు.

కషాయాల తయారీలో సిద్ధహస్తురాలు

కషాయాలు, జీవామృతం, పంచగవ్య వంటి సేంద్రియ ఎరువులు తయారు చేయడంలో సరోజిని సిద్ధహస్తురాలు. బ్రహ్మస్త్రాం, నీమాస్త్రం, అగ్నాస్త్రం , పంచపత్రం వంటి కషాయాలతో చీడపీడలు రాకుండా చూస్తున్నారు. జీవామృతం తయారు చేసి.. ఎరువుగా వాడుతున్నారు. బెండ, వంగ, టమాటా, బీన్స్, చిక్కుడు, మిరప వంటి కూరగాయలు పంటలు సాగుచేస్తున్నారు. ఈ కూరగాయలకు మంచి డిమాండ్ ఉంది. సేంద్రియ కూరగాయాలు కావడం వల్ల.. తోటవద్దకే వచ్చి కొనుగోలు చేస్తుంటారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నానని సరోజిని తెలిపారు. బామ్మ వారసత్వాన్ని తాము నిలబెడతామని కుటుంబసభ్యులు అంటున్నారు. వ్యవసాయం అంటేనే రైతులు భయపడతున్న తరుణంలో... కౌలు పొలంలో సేంద్రియ సాగుచేస్తూ ఆదాయ మార్గాన్ని చూపిస్తున్నారు సరోజిని.

ఇదీ చదవండి:కరోనా విలయ తాండవం.. రాష్ట్రంలో 13వేలు దాటిన కేసులు

ABOUT THE AUTHOR

...view details