ఉపాధ్యాయుల దినోత్సవం సదర్భంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో గురు పూజోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తల్లి జన్మనిస్తే... గురువులు బతుకును నేర్పిస్తారని అన్నారు. విద్యా రంగ అభివృద్ధికి ఉపాధ్యాయులంతా కృషి చేయాలని కోరారు.
కొవిడ్ కారణంగా చాలా రంగాలు నష్టపోయాయని చెప్పారు. విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చాయన్నారు. దూరదర్శన్ ద్వారా పాఠాలు చెప్పడం సంతోషకరమని పేర్కొన్నారు. టీవీ సౌకర్యం లేని విద్యార్థులను ఒకచోటకు చేర్చి పాఠాలు వినిపించారని తెలిపారు. అంతకు ముందు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పలువురు ఉన్నతాధికారులతో కలిసి సబితా ఇంద్రారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపాద్యాయ వృత్తిలో ఉండి... భారత మాజీ రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదగడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.