ED raids in Hyderabad today : దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. తాజాగా మరోసారి ఐదు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది. దిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈడీ సోదాలు చేస్తోంది.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. హైదరాబాద్‌లో పలుచోట్ల ఈడీ సోదాలు - హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
08:15 September 16
ED raids in Hyderabad : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఈడీ సోదాలు
హైదరాబాద్, నెల్లూరులోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. 25 బృందాలుగా ఏర్పడిన అధికారులు.. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు బెంగళూరు, చెన్నైలోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. దిల్లీ నుంచి వెళ్లి అన్నిచోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 40కి పైగా ప్రదేశాల్లో సోదాలు చేపట్టినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
నగరంలో ఉదయం నుంచి ఈడీ అధికారులు పలు చోట్ల సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ దోమలగూడలోని శ్రీ సాయి కృష్ణా రెసిడెన్సిలోని ఓ కార్యాలయంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. దిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన విషయంలో దోమలగూడలోని ఆ రెసిడెన్సీలో ఉన్న గోరంట్ల అసోసియేట్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు సంబంధించిన ఇద్దరు అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆ కార్యాలయం ముందు అపార్ట్మెంట్ వద్ద కేంద్రానికి సంబంధించిన సీఆర్పీఎఫ్ పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ కార్యాలయంలో ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. మరోవైపు హైదరాబాద్ మాదాపూర్‌లోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లోనూ ఈడీ సోదాలు జరుపుతోంది. ఈ ఎన్‌క్లేవ్‌లో ఉన్న అనూస్ బ్యూటీ పార్లర్ కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ED raids in Hyderabad over Delhi liquor scam : ఇంతకు ముందు కూడా దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ హైదరాబాద్‌లో సోదాలు చేసింది. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. సికింద్రాబాద్ పటేల్ రోడ్డులోని నవకేతన్ భవన్లో రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ చిరునామా ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అక్కడికి వెళ్లి తనిఖీ చేసిన ఈడీ అధికారులకు సదరు చిరునామాలో ఓ పేరొందిన బ్యూటీ పార్లర్ ఉన్నట్లు తేలింది. రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్‌లో డైరెక్టర్‌గా ఉన్న అభిషేక్ రావు సదరు బ్యూటీ పార్లర్ సంస్థలకు డైరెక్టర్‌గా ఉన్నారు. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ ఈమెయిల్ అడ్రస్ సైతం ఒకటేనని ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది.
కోకాపేట్‌లోని రాంచంద్ర పిళ్లై నివాసంలోనూ ఈడీ అధికారుల సోదాలు జరిగాయి. పలువురి రాజకీయ ప్రముఖులతో రాంచంద్ర పిళ్లైకి సంబంధాలున్నట్లు అనుమానించిన అధికారులు తగిన ఆధారాలు సేకరించారు.