డ్రాగన్ పండు... పేరు వినగానే చైనాదే అనుకుంటాం కానీ ఇది పుట్టింది దక్షిణ అమెరికాలో. ఏ వాతావరణంలోనయినా సులభంగా పెరగడంతో అనేక దేశాలకు విస్తరించింది. నిజానికి ఇది ముళ్లమొక్కల (కాక్టస్)జాతికి చెందినది. బ్రహ్మకమలంగా భావించి పిలిచే ఓ రకం కాక్టస్ పువ్వు మాదిరిగానే దీని పువ్వులు కూడా అర్ధరాత్రివేళలోనే సువాసనని వెలువరిస్తూ విచ్చుకుని మర్నాటికల్లా ముడుచుకుపోతాయి. అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ ద నైట్ అంటారు.
పండు లోపలి గుజ్జు తెలుపూ ఎరుపూ గులాబీరంగుల్లో నల్లనిగింజలతో ఉంటుంది. తొక్క రంగునీ గుజ్జునీ బట్టి డ్రాగన్ ఫ్రూట్ ప్రధానంగా నాలుగు రకాలు. కానీ వాటి నుంచి హైబ్రిడ్ రకాలు చాలానే పుట్టుకొచ్చాయి. గులాబీరంగు తొక్కతో ఎర్రని గుజ్జుతో ఉండే హైలోసెరస్ పాలీరైజస్ రకం అన్నింటిలోకీ తియ్యగా ఉంటుందట.తొక్కతోబాటు గుజ్జూ నిండు గులాబీ రంగులోనే ఉండే గాటెమాలెన్సిస్ రకాన్ని అమెరికన్ బ్యూటీగా పిలుస్తారు. పసుపురంగులోని సెలెనిసెరస్ అరుదుగా పండుతుంది. పియర్స్, కివీ పండ్లు కలగలిసిన రుచితోనూ నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేంత మృదువైన గుజ్జుతోనూ ఉండే డ్రాగన్ పండుని తినేకొద్దీ తినాలనిపిస్తుంది అంటారు దీన్ని రుచి చూసినవాళ్లు.
అందం-ఆరోగ్యం! క్వీన్ ఆఫ్ ద నైట్ డ్రాగన్ ఫ్రూట్
80 శాతం నీటితో ఉండే డ్రాగన్ పండు తింటే జీర్ణవ్యవస్థ మెరుగై పొట్టకి హాయిగా ఉంటుంది. సి, ఎ, బి1, బి2, బి3 విటమిన్లూ మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలూ సమృద్ధిగా ఉండటంవల్ల రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవాళ్లకి ముఖ్యంగా ఐరన్ లోపంతో బాధపడేవాళ్లకి డ్రాగన్ పండు ఎంతో మంచిది. రోజువారీ ఆహారంలో భాగంగా తింటే- డయాబెటిస్ బాధితులకి రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుందట. టొమాటోల్లోలానే డ్రాగన్ పండ్లలో పుష్కలంగా దొరికే లైకోపీన్, క్యాన్సర్లూ హృద్రోగాలూ బీపీ వంటి రోగాలతోబాటు యూవీ కిరణాల కారణంగా చర్మం దెబ్బతినకుండానూ ముడతలు పడకుండానూ కాపాడుతుంది.
ఈ పండు రసం జుట్టుని ఆరోగ్యంగానూ మృదువుగానూ ఉంచుతుంది. ఇందులోని పీచు మలబద్ధకం లేకుండా చేస్తే, కాల్షియం ఎముక సాంద్రతని పెంచుతుంది, ఆర్థ్రయిటిస్ తగ్గడానికీ సాయపడుతుంది. ఫోలేట్, ఐరన్, బి-విటమిన్ల వల్ల ఇది గర్భిణీలకీ మంచిదే. అంతేకాదు, ఇది ప్రిబయోటిక్‌గా పనిచేస్తూ పొట్టలో బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. పుష్కలంగా ఉండే సి-విటమిన్‌వల్ల ఈ పండు గుజ్జు ఆయింట్‌మెంట్‌గానూ ఉపయోగపడుతుంది. గుజ్జును మొటిమల మీద ఉంచి కాసేపాగి కడిగేస్తే అవి తగ్గుతాయట. ఎండవేడికి దెబ్బతిన్న చర్మాన్ని ఇందులోని బి3 విటమిన్ బాగుచేస్తుంది.
డ్రాగన్ పండు మరీ పండితే త్వరగా పాడై పోతుంది. కాబట్టి పట్టుకున్నప్పుడు నొక్కితే లోపలికంటా గుంట పడకుండా ఉండేవి చూసి కొనాలి. పుచ్చకాయలా మధ్యలోకి కోసి చాకు లేదా స్పూనుతో గుజ్జును మాత్రమే తీయాలి. జిగురుగా ఉండే తొక్క చేదుగా ఉంటుంది. నేరుగా తినడంతోబాటు దీంతో జ్యూసులూ స్మూతీలూ ఐసుక్రీములూ డెజర్టులూ జామ్‌లూ ఇలా చాలానే తయారుచేసుకోవచ్చు. మరి... ఈ ముళ్లపండుని తిని చూద్దామా..!