తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా విపత్తు వేళ అన్నార్తుల ఆకలి తీరుస్తున్న దాతలు - భోజనం వితరణ

కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలకు మానవతామూర్తులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. కొవిడ్‌ బాధితులకు ఆహారం అందిస్తూ అండగా నిలుస్తున్నారు . లాక్‌డౌన్‌ వేళ ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు పట్టెడన్న అందించే వారు కొందరైతే మరికొందరు నిత్యావసర సరుకులు పంపిణీతో ఆదుకుంటున్నారు . కొవిడ్‌ బాధితులకు మెరుగైన చికిత్స కోసం తమవంతు సాయం చేస్తున్నారు.

అన్నార్తుల ఆకలి తీరుస్తున్న దాతలు
help

By

Published : May 30, 2021, 4:10 AM IST

Updated : May 30, 2021, 5:55 AM IST

కరోనా విపత్తు వేళ అన్నార్తుల ఆకలి తీరుస్తున్న దాతలు

కొవిడ్‌ విపత్తు వేళ బాధితులు, నిరుపేదలకు సాయం చేస్తూ దాతలు ఉదారత చాటుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నవారి కడుపు నింపుతున్నారు . మరికొందరు కొవిడ్‌ బారినపడినవారికి పక్కా వైద్యం అందేలా సహకరిస్తున్నారు . హైదరాబాద్‌ ఈస్ట్ రోటరీ క్లబ్, ఆశా జ్యోతి, డాక్లర్స్ ఫర్ యూ సంక్షేమ సంఘాలు సంయుక్తంగా ప్రాజెక్టు బ్రీత్ వెల్ ఆధ్యర్యంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తాకు 7 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను విరాళంగా అందజేశారు. వాటిని చిలకలగూడ రైల్వే ఆరోగ్య కేంద్రంలో వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. ఆరాంఘర్ సమీపంలోని మహమ్మదీయ మజీద్‌లో కరోనా బాధితుల కోసం 40 బెడ్లతో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్, రోటరీ క్లబ్ వారి సహకారంతో రోగులకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నారు . హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడాకారిణి రేఖ పేదలకు అండగా నిలుస్తున్నారు. రేఖ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ ద్వారా రోజుకి దాదాపు వేయి మందికి అన్నదానం చేస్తున్నారు . ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం వితరణ చేస్తున్నారు.

వైద్యుల సాయం..

కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్‌లో 1986 బ్యాచ్‌కు చెందిన వైద్యులు, కాళోజీ యూనివర్సిటీ రిజిస్ట్రర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ కలిసి సుమారు 20 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, మాస్కులు ఇవ్వడం సంతోషకరమన్నారు . కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని కొమరారం, పోచారం గ్రామాల్లోని కొవిడ్ బాధితులను కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని... నిత్యావసరాలు అందజేశారు . ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో ములుగు
ఏఎస్పీ సాయిచైతన్య నిత్యావసరాలను పంపిణీ చేసి అండగా నిలిచారు.

చిన్నారులు సైతం..

కరోనా రక్కసి చేస్తున్న విలయతాండవానికి స్పందించి ఇద్దరు చిన్నారులు సైతం తాము దాచుకున్న నగదును విరాళంగా ఇచ్చారు . నాగార్జున సాగర్‌లోని ఏలేశ్వర శివాలయంలో పూజారిగా పని చేస్తున్న పవన్ కుమార్ శర్మ.. స్థానిక యువకులతో కలిసి నిరుపేదలకు భోజన వితరణ చేస్తున్నారు . తండ్రి చేస్తున్న సేవను చూసిన ఆయన కుమారులు... వారు దాచుకున్న 4వేల 7వందల రూపాయల నగదును అందజేశారు . కరీంనగర్ మంకమ్మతోటకు చెందిన మిత్రమండలి ఆధ్వర్యంలో వంటలు వండి పొట్లాలు కట్టి అన్నార్థులకు పంచుతున్నారు . ఐసోలేషన్‌లో ఉంటున్న కొవిడ్‌ బాధితులతోపాటు రోడ్డు పక్కన ఉంటున్న యాచకులకు భోజనం అందజేస్తున్నారు.

ఇవీ చూడండి:Corona Victims : పది రోజులుగా పస్తులు.. సాయం కోసం పడిగాపులు

Last Updated : May 30, 2021, 5:55 AM IST

ABOUT THE AUTHOR

...view details