తెలంగాణ

telangana

ETV Bharat / city

Doctors Day: ఆ వార్త చెప్పడం బాధనిపించేది..! - వైద్యుల దినోత్సవం

నిద్ర కరవైన రాత్రులు...క్షణం కూడా ఆదమరవలేని రోజులవి! పునర్జన్మ పొందిన రోగులు ఇళ్లకెళ్తుంటే సంతోషించారు! పోరాడి ఓడిన వారిని తమ చేతులతో మార్చురీలకు పంపాల్సి వచ్చినప్పుడు కుమిలి పోయారు. గాంధీ ఆసుపత్రిలో ఆర్‌ఎమ్‌ఓ (రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్లు)లుగా వ్యవహరించిన వారి అనుభవాలు ఇవీ... కొవిడ్‌ గడ్డు రోజులని మనోనిబ్బరంతో జయించి రోగుల్లో, తోటి సిబ్బందిలో స్థైర్యాన్ని నింపారీ డాక్టరమ్మలు. వారిలో ఒకరైన డాక్టర్‌ మాధురి ఆ పరిస్థితుల గురించి వివరించారు...

doctors day special artical
doctors day special artical

By

Published : Jul 1, 2021, 1:11 PM IST

సాధారణ వైద్యులతో పోలిస్తే మా ఆర్‌ఎమ్‌ఓల(రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్లు)పని చాలా కష్టమైంది. అదీ... మామూలు రోజులతో పోలిస్తే ఈ సెకండ్‌వేవ్‌ సమయంలో ప్రజలకు... ఆసుపత్రికి మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించడం సవాల్‌గా మారింది. నాతోపాటు డాక్టర్‌ సత్యరత్న, అన్నపూర్ణ, యశోద, విజయలలిత, శోభ, స్ఫూర్తి, సునీత, వసుధ వంటివారు ఈ బాధ్యతల్ని తీసుకున్నారు.

‘24 గంటలూ రోగుల మధ్యే ఉంటున్నావ్‌. అవసరమా ఈ ఉద్యోగం. ఇంట్లో పిల్లలున్నారు. లాంగ్‌ లీవ్‌ పెట్టేయొచ్చుగా?’ ఆత్మీయుల నుంచీ, అయినవాళ్ల నుంచి ఇలాంటి హెచ్చరికలు వింటూ కూడా మేమంతా విధులకు హాజరయ్యాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం? అని నచ్చచెప్పుకొన్నాం. రోజురోజుకీ వైరస్‌ తీవ్రత పెరగడం తెలుస్తూనే ఉంది. చూస్తుండగానే మామూలు బెడ్ల స్థానంలో ఆక్సిజన్‌, వెంటిలేటర్లున్న బెడ్లు ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం గోడలకి మేకులు కొట్టాలి. అవి కొట్టలేక ప్లంబర్లు చేతులు నొప్పెట్టి అసహన పడుతుంటే మా పరిస్థితి మరోలా ఉండేది. రోజుకి వందల కాల్స్‌. బెడ్స్‌ కావాలని. ఎక్కడెక్కడ నుంచో సిఫారసులు. మరోపక్క ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారి వివరాల గురించిన సమాచారాన్ని వాళ్ల ఆత్మీయులకు చేరవేయాలి. ఒక్కోసారి మా నోటితోనే చావువార్తలనీ చెప్పాల్సి వచ్చేది. చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయిన వారిని చూసి చాలా బాధనిపించేది. తల్లిని కోల్పోయిన పసిపాపలని చూసి కన్నీళ్లు ఆగేవి కావు.'

‘రాత్రే కదా మాట్లాడాం. ఇంతలోనే ఎలా చనిపోతారని ఆత్మీయులు బోరున విలపిస్తుంటే ఓదార్చడం కష్టమయ్యేది. ఆ శవాలు మార్చురీలకు చేరేవరకూ మాదే బాధ్యత. ఆసుపత్రి బయట ఆంబులెన్సులు వరుసలు కట్టేవి. అందులోని రోగులు ఖాళీ అయ్యే బెడ్స్‌ కోసం ఎదురుచూస్తుంటే.. ఆ పరిస్థితుల మధ్య విపరీతమైన ఒత్తిడి ఉండేది. ఇవాళ పొద్దున తొమ్మిదింటికి వస్తే... రేపు తొమ్మిదింటి వరకూ విధుల్లో ఉండేవాళ్లం. మండువేసవి. పీపీఈ కిట్లలో ఉడికిపోతూ, డబుల్‌ మాస్కులు పెట్టుకుని పనిచేసేవాళ్లం. వారాంతపు సెలవులు కూడా వదులుకోవాల్సి వచ్చేది. ఆసుపత్రిలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న రోజుల్లో ఇంట్లోనే వండుకుని తెచ్చుకునేవాళ్లం. కొన్నిరోజులు పెరుగన్నంతోనే సర్దుకోవాల్సి వచ్చేది. ఇంటికెళ్లాక రోజూ తలస్నానం. అదీ ఇబ్బందే కదా! ఏమాత్రం లక్షణాలు కనిపించినా టెస్టులు చేయించుకోవడం.. ఆ ఫలితాలు వచ్చేంతవరకూ ఇంట్లో వాళ్లకి దూరంగా ఉండటం మాకు అలవాటైపోయింది.

తీవ్రమైన పని ఒత్తిడి వల్ల నర్సులు, పారిశుద్ధ్యసిబ్బంది అసహనానికి లోనయ్యేవారు. మొదట్లో పేషెంట్‌ కేర్‌ బాధ్యతలు కూడా తీసుకొనేవాళ్లం. అంటే రోగులకు దగ్గరుండి తినిపించడం, డైపర్లు మార్చడం వంటి పనులు కూడా మా సిబ్బంది చేసేవారు. అంత ఒత్తిడిలో వాళ్లు ఏదైనా అంటే.. పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి అని నచ్చచెప్పేవాళ్లం. మా అందరి పరిస్థితీ అదే కదా మరి. మా అత్తమామలు, మేమూ ఒకే ఫ్లోర్‌లో ఉంటాం. అయినా వారికే అనారోగ్యమూ నావల్ల రాకూడదని దూరంగా ఉండేదాన్ని. పెద్దవాళ్లకు దూరంగా ఉండటం కష్టమే అయినా తప్పలేదు మరి. డాక్టర్‌ అన్నపూర్ణకి నాలుగేళ్లపాప. తను కొవిడ్‌ బారినపడి.. కోలుకుంటన్నారు. మా శ్రమ ఫలించింది. నెమ్మదిగా మరణాలు తగ్గుముఖం పట్టడం మాలో స్థైర్యాన్ని రెట్టింపు చేసింది. చాలామంది రోగులు ‘మాకిది పునర్జన్మ’. అంటూ కాళ్లమీద పడిపోయేవారు. మీరు అందించిన సేవలకు ప్రతిఫలంగా ఎంతో కొంత వెనక్కి ఇవ్వాలనుకుంటున్నాం అంటూ తోచిన సాయం అందించేవారు. కొందరు మాస్కులు, గ్లౌవుజులు ఇస్తే ఇంకొందరు ఆక్సిజన్‌ కాన్‌సెన్‌ట్రేటర్లు వంటివి ఇచ్చేవారు. వీటన్నింటికన్నా రోగులు కోలుకుని ఇంటికెళ్తుంటే కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనిది.

ఇదీ చూడండి: National Doctors' Day : అలసట ఎరుగని యోధులు.. ప్రాణాలు కాపాడిన దేవుళ్లు

ABOUT THE AUTHOR

...view details