Omicron Variant News : వ్యాప్తిలో ఒమిక్రాన్ వేగం.. వ్యాక్సిన్‌తో దూరం
Omicron Variant News : కరోనాలో డెల్టా వేరియంట్ కంటే రెండు, మూడు రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని, మనిషి శరీరంలోని రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకునే గుణం దీనికి ఎక్కువని, ఫలితంగా కేసులు పెరుగుతాయని.. కొవిడ్-19 పరిశోధకుడు డాక్టర్ శ్రీధర్ చిలిమూరి చెప్పారు. అమెరికాలోని న్యూయార్క్ బ్రాంక్స్ కేర్ హాస్పిటల్ సెంటర్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడిసిన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయన... అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్, అమెరికన్ గ్యాస్ట్రో ఎంటరోలాజికల్ అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉన్నారు. ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ప్రతినిధికి ఆన్‌లైన్ ద్వారా ఆదివారం ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు..
ఒమిక్రాన్ వ్యాప్తి
By
Published : Dec 13, 2021, 9:18 AM IST
టీకాలు తీసుకోనివారు, తీసుకున్న వారిపై ఒమిక్రాన్ ప్రభావం?
Omicron Variant News : దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ సోకి.. ఆసుపత్రుల్లో చేరిన వారిలో ఎక్కువ మంది టీకా తీసుకోనివారు, ఒక్కడోసు మాత్రమే తీసుకున్న వారు ఉన్నారు. రెండు డోసులు పొందిన వారికి రక్షణ లభిస్తోంది. అమెరికాలాంటి దేశాల్లో రెండో డోసు తీసుకున్న 6 నెలల తర్వాత బూస్టర్ డోసు పొందాలన్న ఆదేశాలు వచ్చాయి. బూస్టర్ డోసు వేయించుకున్న వారిలో ఒమిక్రాన్ బారినపడిన కేసులు ఇంకా వెలుగులోకి రాలేదు.
ఒమిక్రాన్ వ్యాప్తి నియంత్రణలోనే ఉన్నట్లు అనిపిస్తోంది కదా! కంగారుపడాల్సిన అవసరం ఉందా!
Omicron Cases Today : తప్పక అప్రమత్తంగా ఉండాలి. యూకే, దక్షిణాఫ్రికాలో మూడో వేవ్ మొదలైంది. అమెరికాలో 40% మంది వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏ మ్యుటేషన్ ప్రభావమైనా ప్రారంభంలో సాధారణంగా కనిపిస్తుంది. తర్వాత పెరుగుతుంది. నవంబరు తొలి వారంలో దక్షిణాఫ్రికాలో వచ్చిన కేసుల కంటే... డిసెంబరు మొదటి వారంలో వచ్చినవి అత్యధికమనే విషయాన్ని గమనించాలి. ఒమిక్రాన్ ప్రభావం మొదలైన తొలి రోజుల్లో అక్కడ రోజుకు వెయ్యి కేసులు రాగా ఇప్పుడా సంఖ్య 10 వేలైంది. అయితే బాధితుల్లో 3% మందే ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది. అదే డెల్టా సోకిన వారిలో 20% మంది ఆసుపత్రుల్లో చేరారు. ఇప్పటికే 55 దేశాల్లో ఒమిక్రాన్ జాడలు బయటపడ్డాయి. దీని ప్రభావం తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరణాలు లేనందున తేలిగ్గా తీసుకుంటున్నారు. ఒమిక్రాన్ వల్ల రీ-ఇన్‌ఫెక్షన్లూ అధికంగా కనిపిస్తున్నాయి. ఈ వేరియంట్‌ను నిలువరించాలంటే వ్యాక్సినేషన్‌ను ఉద్ధృతం చేయాలి. రెండోడోసు పొందిన వారు 6 నెలల తర్వాత మూడో డోసు తీసుకుంటే మంచిది.
ఒమిక్రాన్ సోకితే తీవ్ర ప్రభావం ఉంటుందా?
Omicron Latest News : సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో 10 నుంచి 14 రోజుల్లో వైరస్ ప్రభావం తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో 20 నుంచి 30 రోజుల వరకు ప్రభావం కొనసాగుతుంది. కొందరి శరీరంలో 200 రోజుల దాకా వైరస్ ప్రభావం ఉండొచ్చు. ఇలా ఎక్కువకాలం మనిషి శరీరంలో ఉంటున్నందున వైరస్ మార్పులకు గురవుతుంది. దక్షిణాఫ్రికా జనాభాలో 13% మంది హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌తో ఉన్నారు. వీరి నుంచే ఒమిక్రాన్ విస్తృతంగా వ్యాప్తి చెంది ఉండొచ్చునని భావిస్తున్నారు. ఒమిక్రాన్ మనిషి శరీరంలో చేరాక వృద్ధి చెందేందుకు 3 నుంచి 6 రోజులు పడుతుంది. ఇప్పటి వరకు వచ్చిన వేరియంట్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందేందుకు కనీసం 10 నుంచి 14 రోజులు సమయం పడుతుంది. ఒమిక్రాన్‌లో మరో వేరియంట్ ఇప్పుడు బయటకు వస్తోంది. ఈ వేరియంట్ బారినపడిన ఓ వ్యక్తికి కొవిడ్ వచ్చిందా? లేదా? అనేది ఆర్టీపీసీఆర్ పరీక్షతోనూ వెల్లడి కాలేదు. ఈ పరీక్షలో నెగెటివ్ వచ్చిన ఓ నమూనాను జినోమ్ సీక్వెన్సింగ్ చేయగా అప్పుడు ఒమిక్రాన్ జాతికి చెందిన రెండో వేరియంట్ ఉన్నట్లు తేలింది. దీనిపై ఇంకా అధ్యయనం సాగుతోంది.