దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణకు సుప్రీం ఆదేశించింది. సుప్రీంవిశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.ఎస్. సిర్పుర్కర్ నేతృత్వంలో బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రకాశ్, సీబీఐ మాజీ అధిపతి డి.ఆర్.కార్తికేయన్ సభ్యులుగా న్యాయ విచారణ సంఘాన్ని నియమించింది. ప్రారంభించిన నాటి నుంచి ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని పేర్కొంది.
సీఆర్‌పీఎఫ్- భద్రత
భిన్న వాదనల నేపథ్యంలో ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. న్యాయవాదులు జి.ఎస్. మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్, ఎం.కె. శర్మ, ఎం.ఎల్. శర్మ దాఖలు చేసిన మూడు వేర్వేరు పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. త్రిసభ్య సంఘానికి సీఆర్‌పీఎఫ్‌తో భద్రత కల్పించాలని ఆదేశించింది.
కోర్టుల్లో ఉన్న పిటిషన్లపై స్టే
హైదరాబాద్ కేంద్రంగా కమిటీ పనిచేస్తుందని, వీరికి కావాల్సిన వసతుల్ని తెలంగాణ ప్రభుత్వం సమకూర్చాలని ఆదేశించింది. ఎన్‌కౌంటర్ మీద కోర్టుల్లో ఉన్న పిటిషన్లపై స్టే విధించింది. కేసు విచారణపై వార్తలు రాకుండా మీడియాను కట్టడి చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. మీడియా నోరు కట్టేయలేమంది. అయితే నియంత్రణ పాటించాలని, అధికారికంగా ఇచ్చిన సమాచారాన్నే మీడియా ప్రసారం చేయాలని ధర్మాసనం పేర్కొంది.
- ఎన్‌కౌంటర్‌పై సందేహాలు..?
పిటిషనర్, న్యాయవాది జి.ఎస్. మణి తనవాదనలు ప్రారంభిస్తూ.. ఎన్‌కౌంటర్‌పై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. సుప్రీం ఇచ్చిన 16 మార్గదర్శకాలను పోలీసులు అనుసరించలేదని ఆరోపించారు. దిశ అత్యాచార ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఎన్‌కౌంటర్ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. పోలీసుల్ని చంపాలని నిందితులు ప్రయత్నించడంతో ఆత్మరక్షణకు పోలీసులు ఎదురుకాల్పులు జరపగా నిందితులు మృతిచెందారని పేర్కొన్నారు.
పోలీసుల్ని ప్రాసిక్యూట్ చేయాలి
నిందితులను తీసుకెళ్లే సమయంలో తూటాలతో నిండిన తుపాకులు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది’’ అని ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. ఘటనపై నిష్పక్షపాతమైన విచారణ జరపడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని, సమాంతరంగా న్యాయ విచారణ జరపడం చట్ట విరుద్ధమని రోహత్గి తెలిపారు. ప్రజలు నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారని సీజేఐ చెప్పారు. విచారణను అడ్డుకోవద్దు అని ఆదేశించారు.
"నలుగురు నిందితులు చనిపోయిన నేపథ్యంలో వారిపై విచారణ వల్ల ఎలాంటి ఫలితం లేదు. వారు ఎలాగూ హాజరు కాలేరు. పోలీసులు మాత్రమే ఆధారాలు ఇవ్వగలరు. మరింత పారదర్శకంగా విచారణ సాగనిద్దాం" - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే