రెండో రోజు శాసనసభలో రెవెన్యూ, ఎక్సైజ్, వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, పౌరసరఫరాలు, రవాణా, హోంశాఖకు సంబంధించిన పద్దులపై చర్చ జరిగింది. సభ్యులు లేవనెత్తిన వివిధ అంశాలపై మంత్రులు సమాధానం ఇచ్చారు. ఆయా బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
మద్యంపై ఆదాయం పెంపు
దుకాణాలు పెంచకుండానే ఆబ్కారీ ఆదాయం రెట్టింపు చేసుకున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మద్యం నియంత్రించి, బెల్టు షాపులు రద్దు చేయాలని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన డిమాండ్‌కు మంత్రి వివరణ ఇచ్చారు. ప్రభుత్వ సమర్థ చర్యలతోనే ఆబ్కారీ ఆదాయం పెంపు సాధ్యమైందని గుర్తుచేశారు.
మూసీకి 10వేల కోట్లు
మూసీ నదిలో మురికిని తొలగించి, సుందరమైన నదిగా తీర్చిదిద్దడానికి రూ.50 వేల కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లో మూసీ నది ప్రక్షాళనకు రూ.10 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు.
పెరిగిన వరి సాగు
రైతుల కన్నీరు తుడవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం జలాలతో ఖరీఫ్‌లో 40 లక్షలు, రబీలో 38 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు మంత్రి తెలిపారు. అన్ని నియోజకవర్గాల పరిధిలోని చెరువులు, వాగుల్లో నీటిని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.