కరోనా నుంచి బయట పడిన తర్వాత 5 నుంచి 10 శాతం మందిలో కొత్తగా మధుమేహం బయటపడుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ తగ్గడానికి చాలా మందికి స్టెరాయిడ్లు అందిస్తున్నారు. ఈ క్రమంలో శరీరంలో చక్కెర స్థాయిలు తాత్కాలికంగా పెరుగుతాయి. తర్వాత 2 నుంచి 3 వారాలకు తగ్గిపోతాయి. మరి కొందరిలో స్టెరాయిడ్లు మానేసిన 2 నెలలకు కూడా చక్కెర స్థాయిలు నియంత్రణలోకి రావడం లేదు. దీంతో చాలా మంది వైద్యులను సంప్రదిస్తున్నారు. అయితే స్టెరాయిడ్లు తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఈ పరిస్థితి ఉంటుందని చెప్పలేమని, 5 నుంచి 10 శాతం మందిలో మాత్రం ఈ పరిస్థితి కొనసాగుతోందని వైద్యులు తెలిపారు.
- ఐటీ ఉద్యోగి సుభాష్ నెల రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. చికిత్సలో భాగంగా వైద్యులు స్టెరాయిడ్లు వినియోగించారు. దాంతో మధుమేహం పెరిగింది. వైద్యుల సూచనతో ఇన్సులిన్ తీసుకున్నారు. ప్రస్తుతం స్టెరాయిడ్లు వాడటం మానేసి రెండు వారాలు గడుస్తున్నా.. చక్కెర స్థాయిలు మాత్రం తగ్గడం లేదు.
- ప్రైవేటు ఉద్యోగి సతీష్ కరోనాతో స్టెరాయిడ్ల కారణంగా మధుమేహం పెరిగింది. మానేసి రెండు నెలలు గడుస్తున్నా.. నియంత్రణలోకి రాకపోవడంతో వైద్యులను సంప్రదించాడు. కరోనా రావడానికి ముందే ప్రీడయాబెటిక్ పరిస్థితి ఉందని, కరోనాతో అది బయట పడిందని తెలిపారు. మందులు వాడాలని సూచించారు.
కారణాలు ఇవేనా?
- కొవిడ్ రోగుల్లో మధుమేహం కొనసాగటానికి పలు కారణాలు దోహదం చేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్ అతుక్కునేందుకు కారణమయ్యే ఏసీఈ-2 రిసెప్టార్‌లు.. క్లోమగ్రంథిపై కూడా ఉండి, ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుందని, ఇది మధుమేహానికి దోహదం చేస్తుందని కొన్ని విశ్లేషణలు బయట పడ్డాయని వైద్యులు చెబుతున్నారు.
- కొందరిలో మధుమేహం ఉన్నా ఎలాంటి లక్షణాలు బయట పడవు. 75 శాతం మందిలో ఇదే జరుగుతుంది. తమకు మధుమేహం సమస్య ఉందని గ్రహించరు. కరోనా సోకిన తర్వాత వివిధ రక్తపరీక్షల్లో మధుమేహం ఉన్నట్లు బయట పడుతుంది. స్టెరాయిడ్ల వాడకంతో ఇది మరింత పెరుగతుంది.
- మరికొందరిలో వ్యాధి బార్డర్ స్థాయిలో ఉంటుంది. ఇలాంటి వారిని ప్రిడయాబెటిక్స్‌గా భావిస్తారు. ఇలాంటి వారు కరోనా చికిత్స కోసం స్టిరాయిడ్లు తీసుకుంటున్నప్పుడు చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. తర్వాత కూడా వ్యాధి కొనసాగుతోంది. వీరు జీవితాంతం మందులు తీసుకోవాల్సిందేనని వైద్యులు తెలిపారు.