తెలంగాణ

telangana

ETV Bharat / city

18 ఏళ్లు నిండిన వారికి టీకాలు అప్పుడే కాదు: డీహెచ్‌ శ్రీనివాస్‌

గత వారం నుంచి రాష్ట్రంలో పరిస్థితులు కుదుటపడుతున్నాయని డీహెచ్‌ శ్రీనివాస్​ తెలిపారు. కరోనా వేళ ప్రజలందరూ సహకరిస్తున్నారని... రాష్ట్రంలో కేసుల్లో స్థిరత్వం ఉందన్నారు. వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకమన్న డీహెచ్‌ శ్రీనివాస్‌... వచ్చేది పెళ్లిళ్లు, పండగల సీజన్‌ కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

dh srinivas about corona situation in telangana
dh srinivas about corona situation in telangana

By

Published : Apr 28, 2021, 3:21 PM IST

Updated : Apr 29, 2021, 4:55 AM IST

కొవిడ్‌ విషయంలో వచ్చే 4 వారాలు అత్యంత కీలకమైనవని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమివ్వాలని కోరింది. ఉదాసీన ధోరణితో వ్యవహరిస్తే ఆరోగ్యానికి తీవ్ర చేటు జరిగే ప్రమాదముందని హెచ్చరించింది. ‘‘రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో కేసుల నమోదులో కొంత స్థిరత్వం వచ్చిందే తప్ప.. పూర్తిగా అదుపులోకి రాలేదు. వచ్చేది పెళ్లిళ్లు, పండుగల సీజన్‌. ఈ సమయంలోనే మరింత అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే కరోనా రెండోదశ ఉద్ధృతి నుంచి బయటపడే అవకాశాలుంటాయి’’ అని పేర్కొంది.

కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 45 లక్షల మందికి టీకాలు అందించామన్నారు. మిగిలిన వారికీ వ్యాక్సిన్‌ లభ్యతను బట్టి వీలైనంత త్వరగా టీకాలను వేసేందుకు కృషిచేస్తున్నట్టు వివరించారు. 18 ఏళ్లు పైబడినవారు టీకాల కోసం ముందుగా తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలని తెలిపారు. మే 1 నుంచి వారికి వ్యాక్సిన్‌ ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్రం ప్రకటించినా వెంటనే టీకాలు ఇవ్వడం సాధ్యం కాదని, మరికొంత సమయం పడుతుందని తెలిపారు.

అనవసరంగా రోజుల వ్యవధిలోనే పరీక్ష చేయిస్తున్నారు
‘‘కొవిడ్‌ అని తెలియగానే ఆసుపత్రులకు పరుగులు పెట్టొద్దు. అదే సమయంలో అలసత్వమూ పనికిరాదు. జ్వరం, దగ్గు, జలుబు, కళ్లలో మంట, కళ్లు ఎర్రబడడం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం తదితర లక్షణాలుంటే కొవిడ్‌ పరీక్ష అవసరం. ఇవేవీ లేని వారు కూడా పెద్దఎత్తున పరీక్షల కోసం వచ్చి తోసుకుంటున్నారు. కొందరైతే ఎటువంటి లక్షణాలు లేకపోయినా.. వారానికి రెండుసార్లు కూడా చేయించుకుంటున్నారు. ఫలితంగా అవసరమైన వారు పరీక్షలు చేయించుకోడానికి ఇబ్బంది పడుతున్నారు. అందుకే అనవసరంగా పరీక్షలు చేయించుకోవద్దు. అలాగే 101 డిగ్రీల కంటే జ్వరం ఎక్కువగా ఉంటుంటే.. ఆక్సిజన్‌ శాతం పడిపోతుంటే.. నడుస్తుంటే ఆయాసం వస్తుంటే.. వెంటనే ఆసుపత్రిలో చేరాలి.

రెండో డోసు ఎక్కడైనా తీసుకోవచ్చు...
తొలిడోసు పొందిన దగ్గరే రెండోది కూడా తీసుకోవాలనేమీ లేదు. ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబరుతో ఎక్కడైనా స్వీకరించవచ్చు. టీకాల కొరత దృష్ట్యా ముందుగా రెండో డోసు వారికే ప్రాధాన్యమిస్తున్నాం. ఒక వ్యక్తి మాస్కు ధరిస్తే 50 శాతం రక్షణ లభిస్తుంది. ఇద్దరు ఎదురెదురుగానో... పక్కపక్కనో ఉన్నారనుకుంటే ఉభయులూ మాస్కు ధరిస్తే 80 శాతం ప్రయోజనం ఉంటుంది. మాస్కు ధరించడాన్ని వ్యక్తిగత బాధ్యతగా భావించాలి.

50-60 శాతం నిండిన ఆక్సిజన్‌,ఐసీయూ పడకలు
గత ఏడాది తొలిదశకు ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,000 పడకలకు కూడా ఆక్సిజన్‌ సదుపాయం లేదు. అప్పట్లో యుద్ధప్రాతిపదికన 10 వేల బెడ్‌లకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పించాం. ముందు చూపుతో ఆక్సిజన్‌ నిల్వ సామర్థ్యం పెంచాం. మరో రూ.20 కోట్లతో మిగిలిన పడకలకూ ఆక్సిజన్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. బెడ్‌ల లభ్యత సమాచారం 108 అంబులెన్సు సిబ్బంది వద్ద కూడా లభిస్తుంది. ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి రోగిని త్వరితగతిన తీసుకెళ్లడానికి ఇది దోహదపడుతుంది. కొవిడ్‌ చికిత్సల కోసం 50 వేలకు పైగా పడకలను ఇప్పటికే సిద్ధం చేశాం. ఇందులో 18 వేలకు పైగా ఆక్సిజన్‌వి, 10 వేలకు పైగా ఐసీయూవీ ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో మరిన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి 50-60శాతం ఆక్సిజన్‌, ఐసీయూలవి నిండాయి.

ఫిర్యాదులకు వాట్సప్‌ నంబరు 91541 70960..

ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదులు వస్తున్నాయి. విచారించి చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదులను 91541 70960 నంబరుకు వాట్సప్‌ చేయండి. మే 1 నుంచి టీకాలను ప్రైవేటు ఆసుపత్రులే కొనుక్కుంటాయి. ప్రభుత్వం నుంచివెళ్లవు. ఇప్పటివరకూ పంపిణీ చేసిన టీకాల వినియోగంపై తనిఖీ ఉంటుంది.

రెమ్‌డెసివిర్‌ ఏమీ బ్రహ్మాస్త్రం కాదు..

రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ఏమీ బ్రహ్మాస్త్రం కాదు. దీన్ని ఇప్పటికీ ప్రయోగాత్మకంగానే వినియోగిస్తున్నారు. ఆసుపత్రుల్లో మరణాలకు కేవలం కొవిడ్‌ ఒక్కటే కారణం కాదు. ఇతర అనారోగ్య సమస్యలతోనూ నిత్యం చనిపోతుంటారు. అన్నీ కరోనా ఖాతాలో వేయొద్దు’’ అని ప్రజారోగ్య సంచాలకులు, వైద్యవిద్య సంచాలకులు తెలిపారు. కొవిడ్‌ ఐసీయూ వార్డుల్లో ఏసీ ఉండడం లేదని విలేకరులు ప్రశ్నించగా దాని వల్ల రోగుల ఆరోగ్యానికి నష్టం చేకూరుతుందని తెలిపారు.

లాక్‌డౌన్‌ విధించాలని ప్రతిపాదించలేదు..

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించాలని వైద్య ఆరోగ్య శాఖ తరఫున తాము ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని ఆ శాఖ సంచాలకుడు జి.శ్రీనివాస్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం కేసుల పెరుగుదలలో స్థిరత్వం వచ్చిందని, ప్రజలు ఇలాగే జాగ్రత్తలు పాటిస్తే మరో మూడు, నాలుగు వారాల్లో వైరస్‌ అదుపులోకి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పెట్టాలన్న ఉద్దేశం వైద్య ఆరోగ్య శాఖకు లేదని ఆయన స్పష్టం చేశారు.

టీకా తీసుకున్న తర్వాత ఎవరూ పెద్దగా కొవిడ్‌ తీవ్రతతో ఇబ్బంది పడట్లేదు. ఉదాహరణ వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డే. టీకా రెండు డోసులు పొందిన తర్వాత ఆయనకు వైరస్‌ సోకింది. అయినా స్వల్ప చికిత్సతో కోలుకున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో 80 శాతం మంది వైరస్‌ బారినపడడం లేదనే విషయాన్ని గుర్తించాలి.

- ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు

ఇదీ చూడండి:'విజయోత్సవ ర్యాలీలు నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'

Last Updated : Apr 29, 2021, 4:55 AM IST

ABOUT THE AUTHOR

...view details