కొవిడ్ మహమ్మారి నుంచి కాపాడే దివ్యౌషధంగా భావిస్తున్న వ్యాక్సిన్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ అత్యవసర వినియోగ అనుమతులు జారీ చేసింది. డిసెంబర్లోనే భారత్ బయోటెక్ సహా.. సీరం సర్వే ఆఫ్ ఇండియా, ఫైజర్ టీకాలు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోగా.. సమగ్ర సమాచారం కావాలని కోరుతూ డీసీజీఐ అప్పట్లో టీకా అనుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆయా సంస్థలు అందజేసిన అనదపు సమాచారాన్ని డిసెంబర్ 30న పరిశీలించిన ఎస్ఈసీ నేడు భారత్ బయోటెక్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు జారీ చేసింది.
అక్కడ కూడా కొవాగ్జిన్ ట్రయల్స్
నేటి నుంచి దేశంలో భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా అందుబాటులోకి రానుంది.రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌లో అత్యుత్తమ ఫలితాలను ఇచ్చిన కొవాగ్జిన్ టీకా.. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. సుమారు 20వేల మందిపై ఈ ప్రయోగాలు సాగుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌లలోనూ కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టడం విశేషం.
ఉత్తమ ఫలితాలు
తొలుత 20 రీసస్ కోతులపై 14రోజుల వ్యవధిలో రెండు డోజులు ఇచ్చి ప్రయోగం చేశారు. వ్యాక్సిన్ ఇచ్చిన కోతుల్లో ఐజీజీ యాంటీబాడీల పెరుగుదలతో పాటు.. గొంతు, ముక్కు, ఊపిరితిత్తుల్లో వైరస్ పెరుగుదలను నియంత్రించినట్లు గుర్తించారు. ఆ దశలో కొవాగ్జిన్ దాదాపు 65 శాతం సామర్థ్యాన్ని చూపినట్లు నిపుణులు స్పష్టం చేశారు. గతేడాది జులైలో దేశవ్యాప్తంగా 12 కేంద్రాల్లో 375 మంది వాలంటీర్లతో తొలిదశ మానవులపై టీకా ప్రయోగాలను చేపట్టారు. సెప్టెంబర్‌లో 750 మందిపై రెండో దశ ప్రయోగాలు చేయగా రెండు దశల్లోనూ టీకా తీసుకున్న వారిలో ఎలాంటి దుష్పరిణామాలు లేకపోగా.. వైరస్ నుంచి రక్షణ కల్పించటంలో ఉత్తమ ఫలితాలను ఇచ్చినట్లు గుర్తించారు.
కరోనా నుంచి రక్షణ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 25 కేంద్రాల్లో .. సుమారు 20వేల మందిపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వాలంటీర్లకు మొత్తం 28 రోజుల్లో 6 మైక్రో గ్రాముల ఇంజక్షన్లు రెండు సార్లు లేక ప్లాసిబో రెండు డోస్‌లను ఇస్తున్నట్లు సంస్థ గతంలోనే ప్రకటించింది. దేశంలో అత్యధిక మందిపై జరుగుతున్న మొట్టమొదటి ఫేజ్ 3 వ్యాక్సిన్ ట్రయల్స్ ఇవే కావడం విశేషం. వైరస్ నుంచి సురక్షితం అయ్యేందుకు రెండు డోసులను నిర్ణీత కాల వ్యవధిలో తీసుకోవటం తప్పని సరి కాగా.. కొత్తరకం వైరస్ పైనా ఇది ప్రభావం చూపుతుందని భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా ఇప్పటికే ప్రకటించారు. ఐసీఎంఆర్, వైరాలజీ ల్యాబ్‌లతో కలిసి అనతి కాలంలోనే కొవాగ్జిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది భారత్ బయోటెక్. కొవాగ్జిన్‌లో అల్ హైడ్రాక్సిక్విమ్- 2 అనే కారకం ఉండటం వల్ల మెరుగైన వ్యాధినిరోధక శక్తినివ్వటంతోపాటు ఎక్కువ కాలం హానికారక కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని భారత్ బయోటెక్ తెలిపింది.