తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ: మూడు రాజధానుల కేసులపై ఇకపై రోజువారీ విచారణ! - మూడు రాజధానుల కేసులపై హైకోర్టులో విచారణ

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై మరో మూడు వారాలు యథాతథ స్థితే కొనసాగనుంది. మూడు రాజధానుల ఏర్పాటుకు వీలుకల్పించే.. పాలనా వికేంద్రీకరణ- సీఆర్డీఏ రద్దు చట్టాల అమలు నిలుపుదల పిటిషన్లపై సెప్టెంబర్ 21 వరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత రోజువారీ వాదనలు వింటామని తెలిపింది.

ap high court
ఏపీ: మూడు రాజధానుల కేసులపై ఇకపై రోజువారీ విచారణ!

By

Published : Aug 27, 2020, 11:20 PM IST

ఏపీలో పాలనా వికేంద్రీకరణ- సీఆర్డీఏ రద్దు చట్టాల అమలుపై దాఖలైన పిటిషన్​లపై విచారణకు ఏపీ హైకోర్టు సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది. అప్పటి వరకూ ఈ అంశంలో యథాతథ స్థితి కొనసాగుతుందని తెలిపింది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ.. ఏపీ ప్రభుత్వం చేసిన పాలనా వికేంద్రీకరణ- సీఆర్డీఏ రద్దు చట్టాలను జూలై 31న గవర్నర్ ఆమోదించారు. వీటిని వ్యతిరేకిస్తూ.. ఏపీ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆగస్టు 4న స్టేటస్ కో విధించింది. వీటిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం.. సెప్టెంబర్ 21వరకు స్టేటస్ కో ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. కౌంటర్​లు దాఖలు చేయడానికి ఏపీ ప్రభుత్వానికి సెప్టెంబర్ 11 వరకు గడువిచ్చింది. దీనిపై అభ్యంతరాలను సెప్టెంబర్ 17లోగా తెలిపేందుకు పిటిషనర్లకు అవకాశం ఇచ్చింది.

రోజువారీ విచారణ

మూడు రాజధానుల ఏర్పాటుపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారించేందుకు ఇక రోజువారీ విచారణను ప్రత్యక్షంగా చేపడతామని ఏపీ హైకోర్టు తెలిపింది. దీనిపై అందరి అభిప్రాయాలు విన్న తర్వాత కోర్టులో భౌతిక దూరం పాటిస్తూ.. విచారణ చేపడతామని చెప్పింది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని వారం రోజుల్లో చెబుతామని కోర్టు ప్రకటించింది.

సుప్రీంలో తిరస్కరణ

మూడు రాజధానుల వ్యవహారంపై ఏపీ హైకోర్టులో స్టేటస్ కో కొనసాగుతుండగానే దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పాలనా వికేంద్రీకరణ- సీఆర్డీఏ రద్దు చట్టాల అమలుపై స్టేటస్ కో విధిస్తూ.. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వలను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. వ్యవహారం అక్కడే తేల్చుకోమని చెప్పింది. హైకోర్టులో విచారణ ప్రక్రియ తొందరగా పూర్తవుతుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

ABOUT THE AUTHOR

...view details