గ్రేటర్ ఎన్నికల పోలింగ్లో ఈసారి.. సైక్లింగ్ బ్యాలెట్ విధానం అమలుకానుంది. ఈ విధానం నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. భద్రతా లోపాలుంటే ఆ విధానంతో ఫలితాన్ని ఏకపక్షం చేసే వీలుండటమే అందుకు కారణం. పలు పార్టీలు ఈ విషయంపై ఇటీవల ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేయడం గమనార్హం.
బల్దియా పోరులో బ్యాలెట్ పోలింగ్.. నేతల గుండెల్లో గుబులు రేపెన్! - ghmc elections polling
గ్రేటర్‌లో చివరి సారిగా 2002లో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగాయి. తరువాతి ఎన్నికల్లో ఈవీఎంలనే ఉపయోగించారు. సుదీర్ఘ విరామం అనంతరం నగర ఓటర్లు మళ్లీ బ్యాలెట్ పెట్టెలు చూడబోతున్నారు. బ్యాలెట్ పేపరులో నచ్చిన అభ్యర్థి పేరు ఎదురుగా ఎన్నికల సంఘం రబ్బరు స్టాంపు ముద్ర వేసే విధానంలో డిసెంబరు ఒకటిన ఓటేయబోతున్నారు.
2002కి పూర్వం పలు చోట్ల ఎన్నికల నిర్వహణలో భద్రత వైఫల్యాలు ఉండేవి. అదే అదనుగా ఏదేనీ పార్టీకి చెందిన ముఖ్య కార్యకర్త పోలింగ్ కేంద్రం సమీప వీధిలో కూర్చుంటారు. కార్యకర్తలు చుట్టు పక్కల ప్రాంతాల్లోని ఓటర్లను పరిమిత సంఖ్యలో అతడి వద్దకు పంపిస్తారు. అలా వచ్చేవారిలో మొదటి వ్యక్తికి ముఖ్య కార్యకర్త పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఇచ్చే బ్యాలెట్ పేపరును పోలిన డమ్మీ పత్రాన్ని మడత పెట్టి ఇస్తారు. దానిపై రబ్బరు స్టాంపుతో అప్పటికే తమ అభ్యర్థికి ఎదురుగా ముద్ర వేసి ఉంటారు. ఓటరు ఆ చిట్టీని గుట్టుగా తీసుకెళ్లి బ్యాలెట్ పెట్టెలో వేస్తారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారి ఆ ఓటరుకు ఇచ్చే బ్యాలెట్ పేపరును జేబులో లేదా లోదుస్తుల్లో దాచుకుని బయటకు తీసుకొచ్చేవారు.
పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పెట్టె చుట్టూ ఏర్పాటుచేసే అట్టపెట్టెలోకి వెళ్లాక అలా చేసేవారు. బయటికొచ్చాక లోపలి నుంచి తీసుకొచ్చిన బ్యాలెట్ పేపరును ముఖ్య కార్యకర్తకు ఇచ్చి ఓటుకు నోటు తీసుకునే వ్యవహారం అప్పట్లో జోరుగా నడిచేదని సీనియర్ అధికారులు చెబుతున్నారు. అలా వచ్చిన బ్యాలెట్ పేపరులో కార్యకర్తలు తమ అభ్యర్థి పేరుపై ముద్ర వేసి మరో ఓటరుకు ఇచ్చి పంపించేవారు. దాన్ని ఆ ఓటరు డబ్బాలో వేసి, అతనికిచ్చిన బ్యాలెట్ పత్రాన్ని మళ్లీ బయటకు తీసుకురావడం, దానిపై ముద్ర వేసి మరో ఓటరుతో పంపించడం జరిగేది. అందుకే ఈ విధానానికి సైక్లింగ్ బ్యాలెట్ ఓటుగా పేరొచ్చిందని, అలాంటి దుశ్చర్యలకు తావివ్వకుండా ఎన్నికల సంఘం ఈవీఎంలను తీసుకొచ్చిందని ఉన్నతాధికారులు తెలిపారు. బ్యాలెట్ పెట్టెలను ఎత్తుకెళ్లడం, బావుల్లో పడేయడం, పోలింగ్ కేంద్రాల్లోనే డబ్బాల్లో ఇంకు పోయడం వంటి దుర్ఘటనలూ గతంలో జరిగేవని వారు గుర్తు చేస్తున్నారు.