ఇటీవల కురిసిన వర్షాలు 28 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపాయి. 24 గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. గడచిన నాలుగు రోజుల్లో మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, సూర్యాపేట, ములుగు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా.. మిగతా జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. బుధవారం కాస్త తెరపించినప్పటికీ... ఇంకా నీరు పొలాల్లోనే నిలిచి ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజే భారీ వర్షాలు రావడంతో.. తొలుత 3 లక్షల ఎకరాల్లో వరద నీరు చేరింది. ప్రస్తుతం లక్ష ఎకరాలకుపైగా పంటల్లో నీరు నిలిచే ఉంది.
వికారాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి ప్రవహించడం వల్ల వరద ఉద్ధృతి ప్రభావంతో 23 వేల ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయలు పంటలు నీటి మునిగాయి. వరంగల్ జిల్లాలో వరి, వేరుశనగ, పత్తి, మిరప, బొప్పాయి పంటలు 4 వేల 390 ఎకరాల విస్తీర్ణంలో నీట మునిగి దెబ్బతిన్నాయి. హనుమకొండ జిల్లాలో 2 వేల 517 ఎకరాలు, ములుగు జిల్లాలో 15 వేలు, జయశంకర్ భూపాలపల్లిలో 8 వేలు, మహబూబాబాద్ జిల్లాలో 2 వేల 500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లాలో 6వేల 822 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న పంటలు నీటి మునగ్గా... నిర్మల్ జిల్లాలో 25 వేల ఎకరాల్లో సోయాబీన్ సహా వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లాలో 3 వేల ఎకరాలు, మంచిర్యాలలో 400 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం జిల్లాలో 19 వందల ఎకరాల్లో వరి, పత్తి, మిరప, మొక్కజొన్న రైతులు నష్టపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 వేల 786 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు నీటి మునగ్గా... జగిత్యాల జిల్లాలో 600 ఎకరాలు, పెద్దపల్లి జిల్లాలో 490 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు అంతర్గతంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారుల నుంచి ప్రాథమిక సమాచారం అందినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.