ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు వైద్య, ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో నిత్యావసరాలు, మందులకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు సీఎస్. గత పది రోజులుగా చూస్తే కరోనా కేసులు చాలా తగ్గుతున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్ బెడ్లు కొరత లేకుండా చూస్తున్నామని సీఎస్ వివరించారు. ప్రస్తుతం 62,000 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉంది. ఒడిశా నుంచి ఒక ట్యాంకర్ రావాలంటే 6 రోజులు పడుతుంది. రాష్ట్రానికి రోజుకు 125 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా సామర్థ్యం ఉంది. కర్ణాటక, తమిళనాడు నుంచి రావాల్సిన 45 టన్నుల ఆక్సిజన్ రావట్లేదు. ఎయిర్ అంబులెన్సుల ద్వారా ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఆడిట్ చేస్తున్నాం.
- సోమేశ్ కుమార్, సీఎస్
ప్రతి జిల్లాలో ఆర్టీ పీసీఆర్ సౌకర్యం కల్పిస్తామని సీఎస్ అన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన పరిస్థితి మెరుగ్గా ఉందని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సీఎం సమీక్షిస్తున్నారని సీఎస్ వివరించారు. ఎలాంటి చర్యలైనా తీసుకునే స్వేచ్ఛ సీఎం ఇచ్చారని సీఎస్ వెల్లడించారు. భయంతో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు సేకరించి పెట్టుకోవడం మంచిది కాదని ఆయన సూచించారు.
కరోనా భయంతో ఆక్సిజన్ ముందే సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు అనవసర ఆందోళనతో సొంత వైద్యం చేస్తున్నారు. సొంతవైద్యం చేయవద్దు.. ఆస్పత్రులకు వెళ్లండి. కరోనా లక్షణాలు ఉంటే చికిత్స అందించాలని ఐసీఎంఆర్ కూడా చెప్పింది. లక్షణాలు కనిపించగానే చికిత్స ప్రారంభించాలి. సరైన సమయంలో చికిత్స ప్రారంభిస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యం చేసిన వారు ఇబ్బంది పడుతున్నారు. కరోనా లక్షణాలు కనిపించగానే విటమిన్ టాబ్లెట్లు, పారాసెట్మాల్ తీసుకోవాలి. ప్రతి వెయ్యి ఇళ్లకు ఓ వైద్యబృందం ఏర్పాటు చేశాం. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఆస్పత్రికి వచ్చే అవసరమే రాదు.
- సోమేశ్‌కుమార్, సీఎస్
ఇవీ చూడండి:వారాంతపు లాక్‌డౌనా..? కర్ఫ్యూ వేళల పొడగింపా..?: హైకోర్టు