రాష్ట్రంలో కొవిడ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కేవలం 7 రోజుల వ్యవధిలోనే రెట్టింపునకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈనెల 1న 965 కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ కాగా, తాజాగా బుధవారం (7న) ఒక్కరోజే 2,055 కేసులను గుర్తించారు. వీరిలో ఏడుగురు మరణించారు. వారంలో ఏకంగా 40 మంది మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. ఆరు నెలల కిందట గత సెప్టెంబరులో కరోనా వైరస్ విరుచుకుపడిన దానికన్నా తీవ్రంగా తాజాగా కోరలు చాస్తోందని గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. గత ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో రోజుకు 2 వేలకు తగ్గకుండా కొవిడ్ కేసులు నమోదైన పరిస్థితుల్లో.. పడకలు లభించని దుస్థితిలో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు వేల కేసులు ఒక్కరోజులో దాటడం అదే ప్రమాద హెచ్చరికను తెలియజేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరో రెండు నెలల పాటు కొవిడ్ దాడి కొనసాగే ప్రమాదముందని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి.
అన్ని జిల్లాల్లోనూ అప్రమత్తత
ముఖ్యంగా 25 జిల్లాలపై కొవిడ్ పంజా విసురుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో గత నెల 1న కేవలం 27 కేసులు నమోదవగా.. తాజాగా 15 రెట్లు పెరిగింది. గత వారం రోజుల గణాంకాలను పరిశీలించినా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 140కి పైగా అధికంగా కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ నగర, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో కొవిడ్ విరుచుకుపడుతోంది. మిగిలిన జిల్లాల్లోనూ స్వల్ప సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో.. అన్ని జిల్లాల్లోనూ వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తత ప్రకటించింది.
కోలుకునే వారి శాతం తగ్గుతోంది..
బుధవారం 2,055 కొత్త పాజిటివ్‌లు నమోదుకాగా ఏడు మరణాలు సంభవించాయి. ఈ ఏడాదిలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,18,704కు పెరిగింది. ఇప్పటివరకు 1,741 మంది కరోనాతో కన్నుమూశారు. తాజా కొవిడ్ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు. మరో 303 మంది కరోనాకు చికిత్స పొంది ఆరోగ్యవంతులుకాగా, మొత్తంగా 3,03,601 మంది కోలుకున్నారు. నెల రోజుల కిందటివరకు 98 శాతానికి పైగా ఉన్న కోలుకున్నవారి శాతం.. తాజాగా 95.20 శాతానికి తగ్గింది.
పెరిగిన ఐసీయూ చికిత్సలు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 1,702 ఐసీయూ పడకలుండగా.. వీటిలో బుధవారం నాటికి 264 మంది చికిత్స పొందుతున్నారు. వీటిలో అత్యధికంగా చికిత్స పొందుతున్నది గాంధీ ఆసుపత్రిలో 125 మంది కాగా, కింగ్‌కోఠిలో 40 మంది, టిమ్స్‌లో 30 మంది, నిజామాబాద్‌లో 24 మంది ఉన్నారు. గత రెండు వారాల కిందటితో పోల్చితే ఐసీయూల్లో రెట్టింపు స్థాయిలో పడకలు నిండినట్లుగా వైద్యవర్గాలు తెలిపాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికే పడకలు లభించని పరిస్థితులుండగా.. జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ క్రమేణా ఐసీయూల్లో రోగుల చేరికలు పెరిగాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పడకల సంఖ్యను పెంచాలని ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేయడంతో.. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ కార్పొరేట్ ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు.
71 మంది కర్వెన జలాశయం కార్మికులకు