ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో చేరే కొవిడ్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత నెల రోజుల చికిత్సలను పరిశీలిస్తే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల శాతం 21 నుంచి 60 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో (జులై 27 నుంచి ఆగస్టు 27 వరకూ) ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య దాదాపు 23 శాతానికి పైగా తగ్గడం గమనార్హం. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొన్ని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రం ఐసీయూ పడకల్లో చేరికలు పెద్దగా తగ్గలేదు.
ప్రభుత్వ ఐసీయూకు తాకిడి... సీరియస్ అయితే సర్కారు దవాఖానాకే! - తెలంగాణ కరోనావైరస్ వార్తలు
గత నెలరోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల సంఖ్య 21 నుంచి 60 శాతానికి పెరిగింది. ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య దాదాపు 23 శాతానికి పైగా తగ్గింది. జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో.. గ్రామీణ ప్రజలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందడమే ఇందుకు కారణమని వైద్యవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సలకు ఐసీయూ పడకల సంఖ్య పెరిగినా కూడా.. మొత్తంగా చూస్తే చేరికల్లో మాత్రం గుర్తింపు స్థాయిలోనే తగ్గుదల కనిపిస్తోంది. జీహెచ్‌ఎంసీలో కొవిడ్ కేసుల నమోదు కొంత తగ్గుముఖం పట్టడం.. జిల్లాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి క్రమేణా పెరుగుతుండడంతో.. గ్రామీణ ప్రజలు స్థానికంగా చికిత్సలు పొందడానికి ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడుతుండటం ఇందుకు కారణమని వైద్యవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రాష్ట్రంలో కరోనా కేసులు, చికిత్సలపై వైద్యఆరోగ్యశాఖ వెల్లడించిన నివేదికలో ఈ అంశాలను స్పష్టీకరించింది.
ఐసీయూల్లో 51శాతం నిండిపోయాయి
- ప్రస్తుతం(ఈనెల 29 నాటికి) రాష్ట్రంలో మొత్తం 31,284 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతుండగా.. వీరిలో ఐసొలేషన్ కేంద్రాల్లో, ఇళ్లలో చికిత్స పొందుతున్నవారు 24,176 మంది ఉన్నారు.
- మిగిలిన 7,108 మందిలో ప్రాణవాయువు అవసరమై.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఆక్సిజన్ సేవల్లో, ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారు 4948మంది ఉన్నారు.
- ఇతరులు(2160 మంది) స్వల్ప లక్షణాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు.
- ప్రభుత్వ, ప్రైవేటులో కలుపుకుంటే మొత్తం 3098 పడకలు ఐసీయూలో అందుబాటులో ఉండగా.. వీటిలో ప్రస్తుతం 1582(51శాతం) పడకలు నిండిపోయాయి.
- కేవలం ఆక్సిజన్ అందించే పడకలు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి.. 8743 అందుబాటులో ఉండగా. వీటిలో 3366(38.49శాతం) పడకల్లో రోగులు ప్రాణవాయువు పొందుతున్నారు.
- జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 38 ఆక్సిజన్ పడకలు, 5 ఐసీయూ పడకలుంటే.. అన్నింటిలోనూ రోగులు నిండిపోయారు.
- ఖమ్మం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 120 ఆక్సిజన్ పడకల్లోనూ బాధితులు ప్రాణవాయు సేవలు పొందుతున్నారు. 50 ఐసీయూ పడకల్లో 64 శాతం పడకలు నిండిపోయాయి.
- మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 65 ఆక్సిజన్ పడకలుంటే అన్నింటిలోనూ.. 35 ఐసీయూ పడకలుంటే 22 పడకల్లోనూ కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు.
- నల్గొండ జిల్లా సర్కారు ఆసుపత్రిలో 35 ఆక్సిజన్ పడకలు, 25 ఐసీయూ పడకలు నిండిపోయాయి.
- సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలోనూ 40 ప్రాణవాయువు పడకలకు.. 20 ఐసీయూ పడకలుంటే 17 నిండిపోయాయి.
- నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో 205 ప్రాణవాయు పడకలుంటే.. వంద శాతం పడకల్లో రోగులు ఆక్సిజన్ సేవలు పొందుతున్నారు.
- సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనూ 31 ఆక్సిజన్ పడకలకు గాను 24 పడకల్లో రోగులకు చికిత్స అందుతోంది.
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 22 ఆక్సిజన్ పడకల్లో 18 పడకలు, 10 ఐసీయూ పడకల్లో 8 పడకల్లో రోగులు సేవలు పొందుతున్నారు.
- వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 240 ప్రాణవాయు పడకల్లో 184 పడకల్లో సేవలు పొందుతున్నారు. ఇక్కడ 105 ఐసీయూ పడకలుంటే ప్రస్తుతం ఆరు పడకల్లో చికిత్స పొందుతున్నారు.
- హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో 1000 ఆక్సిజన్ పడకలుంటే.. వీటిలో 58 పడకల్లో ప్రాణవాయు సేవలు పొందుతుండగా.. 500 ఐసీయూ పడకలుంటే.. అన్నింటిలోనూ చికిత్స పొందుతున్నారు.
- ఛాతీ ఆసుపత్రిలోనూ 108 ప్రాణవాయు పడకలుంటే.. 100 పడకల్లో సేవలు పొందుతున్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో పరిస్థితి ఇదీ
- జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్, ఐసీయూ పడకలు అధికంగా ఖాళీగానే ఉన్నాయి.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కొవిడ్ చికిత్సకు సంబంధించిన అత్యాధునిక, ఖరీదైన ఔషధాలను అందుబాటులో ఉంచడం.. ఇదే సమయంలో ప్రైవేటులో చికిత్సల ఖరీదు ఎక్కువగా వసూలు చేస్తుండడంతో జిల్లాల్లో ప్రజలు ప్రభుత్వ వైద్యంలో చికిత్స పొందడానికి మొగ్గుచూపుతున్నట్లుగా వైద్యవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
- ఖమ్మం జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో 165 ప్రాణవాయు పడకలుంటే 58 మాత్రమే నిండాయి. 54 ఐసీయూ పడకలుంటే 10 మాత్రమే నిండాయి.
- మహబూబ్‌నగర్ జిల్లాలో 55 ప్రాణవాయు పడకలకు ఒకే ఒక్కటి నిండింది.