తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏడాదిగా ఖాళీగానే ఇళ్లు.. వాయిదాలు కట్టలేక అవస్థలు - corona effect on house owners in telangana

కరోనా మహమ్మారి ఏ రంగాన్నీ వదిలిపెట్టడం లేదు. సొంత ఇంటిలోని పై అంతస్తు అద్దెకు ఇస్తే కాస్త ఖర్చులు కలసి వస్తాయని ఒకరు.. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత అద్దె డబ్బులతో జీవితాన్ని నెట్టుకొస్తామనుకునే వారు.. అప్పు చేసి అయినా అదనంగా ఇంటిని సమకూర్చుకునే వారు.. ఇలా అంతా ఇబ్బంది పడుతున్నారు.

house owners, corona effect on house owners
ఇల్లు అద్దె, ఇంటి యజమానులపై కరోనా ప్రభావం

By

Published : May 14, 2021, 8:50 AM IST

రాము ప్రైవేటు ఉద్యోగి. ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన డబ్బుతో ఇంటిపైన అంతస్తు వేసి.. రెండు పడక గదులు ఉండేలా రెండిళ్లను నిర్మించారు. రూ.26 లక్షలు ఖర్చయ్యాయి. కూడబెట్టిన డబ్బులు రూ.10 లక్షలు పోగా, మరో రూ.16 లక్షలు రుణం తీసుకున్నారు. మొదటి ఆరు నెలలు మారటోరియం అవకాశాన్ని వినియోగించుకున్నారు. తర్వాత రుణం కట్టేద్దామంటే.. రెండిళ్లు ఖాళీగానే ఉన్నాయి. ఇంటిని అమ్మకానికి పెట్టినా ఎవరూ రావడం లేదు.

వెంకటేశం.. ప్రభుత్వ ఉద్యోగి. ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు చేశారు. ప్రస్తుతం మిగిలిన రెండు గదుల అపార్టుమెంటుకు తోడు.. మరో అపార్టుమెంటును ఇటీవలే కొండాపూర్‌లో సమకూర్చుకున్నారు. పింఛను డబ్బులతో పాటు ఆ ఇంటి నుంచి వచ్చే అద్దెతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఏడాదిగా అద్దెకు ఎవరూ రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మకానికి పెట్టాల్సి వచ్చింది. అయినా ఎవరూ ముందుకు రావడంలేదని వాపోతున్నారు.

కరోనా మహమ్మారి ప్రభావం ఇంటి యజమానులపైనా పడింది.బ్యాంకుల్లో రుణాలు తీసుకుని.. వచ్చే అద్దెకు తోడు.. జీతం డబ్బులు లేదా వ్యాపారంలో వచ్చే ఆదాయంతో వాయిదాలు చెల్లించవచ్చునని.. కొత్త ఇంటిని, అపార్టుమెంటులలోని ఫ్లాట్‌ను తీసుకున్న వారు ఏడాదిగా తాళం పడి ఉన్న ఇంటిని చూసి.. తలలు పట్టుకుంటున్నారు. ఎంత తక్కువ అద్దెకు ఇద్దామనుకున్నా.. ఉండే వారు కరవై ఉసూరుమంటున్నారు. అమ్మకానికి పెట్టినా కొనేవారు లేక కష్టాలు పడుతున్నారు.

ఎవరూ అడగని పరిస్థితి

నగరంలోని ఐటీ కారిడార్‌కు అనుకుని ఉన్న గచ్చిబౌలి, గోపన్నపల్లి, మాదాపూర్‌, కొండాపూర్‌, కేపీహెచ్‌బీ, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి ప్రాంతాల్లో వందలు, వేల అపార్టుమెంట్లు వెలిశాయి. కొన్ని ప్రాంతాల్లో 5 అంతస్తులకే పరిమితమవ్వగా.. మరి కొన్ని చోట్ల 15 నుంచి 20 అంతస్తుల వరకూ ఉన్నాయి. ఇక గేటెడ్‌ కమ్యూనిటీల సంగతి సరేసరి. ఇక్కడ ఇల్లు దొరకడం గగనంగా ఉండేది. పేరెన్నిక గల పాఠశాలలో సీటు దొరికినా.. ఆ దగ్గర్లోని ఇల్లు దొరక్క చాలా అవస్థలు పడేవారు. 2 బెడ్‌రూమ్‌లు ఉన్న ఇళ్లు రూ.25 వేలకు తక్కువ లేకుండా అద్దె ఉండేది. 3 బెడ్‌రూమ్‌ల ఇంటికి అయితే రూ.30 వేలు చెల్లించాల్సిందే. ఇక అది గేటెడ్‌ కమ్యూనిటీ అయితే రూ.50 వేలు అద్దెలు ఉండేవి. ఏటా 5 శాతం నుంచి 10 శాతం వరకూ అద్దె పెరిగేది. కానీ ఇప్పుడు అద్దెలు పెరగడం కాదు.. రూ. 25 వేలు ఉన్న ఇంటిని రూ.20 వేలుకు, రూ. 30 వేలకు ఇచ్చే ఇంటిని రూ.25 వేలకు తగ్గించినా.. ఎవరూ అద్దెకు రావడం లేదు.

స్వస్థలం నుంచే పనులు..

ఐటీ దిగ్గజ సంస్థలతో పాటు.. 50 మంది లోపు ఉన్న చిన్న సంస్థలు కూడా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం కల్పించాయి. కార్యాలయాలు కూడా ఖాళీ చేసేసి.. ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని సూచించాయి. ఇలా ఐటీ కారిడార్‌లో 5 లక్షల మంది ఉద్యోగులు ఇప్పుడు ఇంటికి పరిమితమయ్యారు. వీరిపై ఆధారపడిన మిగతా సిబ్బందిలో దాదాపు 80 శాతం మంది ఉద్యోగాలు పోయాయి. వీరిని రోజూ ఇంటి నుంచి కార్యాలయానికి.. తిరిగి ఇంటికి చేర్చే క్యాబ్‌ డ్రైవర్లు కూడా ఉపాధి కోల్పోయారు. ఇలా ఉద్యోగం పోయిన వారు ఇంటికి వెళ్లిపోగా.. ఐటీ ఉద్యోగులు వర్కు ఫ్రమ్‌ హోం అనేది కాస్త వర్కు ఫ్రమ్‌ స్వస్థలంలా మారిపోయింది. ఇలా ఏడాదిగా కొనసాగుతోంది. ఫిబ్రవరిలో పాఠశాలలు కొంత తెరవడంతో నగరానికి వద్దామనుకునే ప్రయత్నాలకు కరోనా సెకెండ్‌ వేవ్‌ బ్రేకులు వేయడంతో ఇప్పుడు అద్దెకు దిగే వారే కరవయ్యారు.

ABOUT THE AUTHOR

...view details