రాష్ట్రంలో మరో 1831 కరోనా కేసులు - కరోనా కేసుల సంఖ్య
21:28 July 06
రాష్ట్రంలో మరో 1831 కరోనా కేసులు
రాష్ట్రంలో సోమవారం కొత్తగా 1,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,733కు చేరింది. ఇవాళ రాష్ట్రంలో వైరస్‌తో 11మంది మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 306కు చేరింది. నేడు 2,078 మంది డిశ్చార్జ్ కాగా... ఇప్పటివరకు 14,781 మంది వైరస్ నుంచి కోలుకొని ఇంటికెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో 10,646 మంది చికిత్స పొందుతున్నారు.
గ్రేటర్లో ఏమాత్రం తగ్గని కరోనా
జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా 1,419 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 160, మేడ్చల్ 117, ఖమ్మం 21, మెదక్, మంచిర్యాల 20, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ అర్బన్, నిజామాబాద్, పెద్దపల్లిలో 9 చొప్పున కేసులు వచ్చాయి. వికారాబాద్లో 7, సూర్యాపేట 6, కరీంనగర్ 5, జగిత్యాల 4, సంగారెడ్డి 3 కేసులు నమోదయ్యాయి. గద్వాల, నారాయణపేట, యాదాద్రి, మహబూబాబాద్‌లో ఒక్కో కేసు నమోదయ్యాయి.
ఆసుపత్రుల్లో పడకల వివరాలు వెల్లడి
రాష్ట్రంలో కరోనా చికిత్సకు ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేవన్న వార్తలపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ... పడకల వివరాలు సైతం వెల్లడించింది. గాంధీలో మొత్తం 1,890 పడకలు ఉండగా... 1,058 ఖాళీగా ఉన్నాయి, కింగ్ కోఠి ఆసుపత్రిలో 350 పడకలకు గానూ.. 239, చెస్ట్ ఆసుపత్రిలో 121 పడకలకు గానూ... 25, ఫీవర్ ఆసుపత్రిలో 140 పడకలు ఉండగా... 18 ఖాళీగా ఉన్నట్టు వివరించింది. హైద్రాబాద్‌లో 2,501 పడకలకు గానూ... 1,340 ఖాళీగా ఉన్నాయని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.