ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మరింత విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 164కు చేరింది. వీరిలో 108 మంది దిల్లీలోని మతపరమైన కార్యక్రమానికి వెళ్లివచ్చిన వారే. మరో 32 మంది వారికి సన్నిహితంగా మెలిగిన వారికి వ్యాధి సోకింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 కేసులు నమోదు కాగా...శుక్రవారం 8మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు.
దిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్ సదస్సుకు వెయ్యి 85 మంది హాజరుకాగా...946 మందే తిరిగి వెనక్కి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన 139 మందిలో కొందరు దిల్లీలోనే ఉండిపోగా...ఇంకొందరు మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలకు వెళ్లినట్లు తేల్చారు. వీరెవ్వరూ ఫోన్‌లు తీయకపోవడంతో వారి వివరాలను ఆయా రాష్ట్రాలకు అందజేశారు.