తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆన్‌లైన్‌ డెలివరీ ఆలస్యం.. రూ.20 వేలు చెల్లించాలంటూ కమిషన్‌ తీర్పు

Online Delivery Delayed : ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ ఇచ్చిన ఓ వ్యక్తికి సదరు సంస్థ నిర్ణీత సమయంలో ఆ వస్తువును డెలివరీ చేయలేకపోయింది. తరచూ గడువు పెంచుతూ చివరకు ఆ ల్యాప్‌టాప్ ఇవ్వలేమని.. నమూనా మార్చి ఇస్తామని చెప్పింది. ఆ వినియోగదారుడు తనకు వేరే మోడల్ వద్దని.. తాను చెల్లించిన నగదు ఇవ్వాలని కోరగా.. అటూ ల్యాప్‌టాప్ ఇవ్వలేదు.. ఇటు నగదూ చెల్లించలేదు. ఆ సంస్థ తీరుతో విసిగిపోయిన వినియోగదారుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. ఆ తర్వాత ఏమైందంటే..

Delay in Online Delivery
Delay in Online Delivery

By

Published : Apr 5, 2022, 8:51 AM IST

Online Delivery Delayed : ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చిన వస్తువును ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డెల్‌ ఇంటర్నల్‌ సర్వీసెస్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ తీరును హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-1 తప్పుపట్టింది. మలక్‌పేట్‌కు చెందిన ఎం.శివ్‌కుమార్‌ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. డెల్‌ వోస్ట్రో 3491 ల్యాప్‌టాప్‌ నమూనాకు రూ.38,489 చెల్లించి 2020 అక్టోబరు 23న ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చారు. నవంబర్‌ 14న డెలివరీ ఇస్తామని తొలుత చెప్పినప్పటికీ ప్రతివాద సంస్థ ఆ తేదీని తరచూ మారుస్తూ వచ్చింది. చివరిగా డిసెంబరు 30న ఇస్తామని చెప్పి విఫలమైంది. అనంతరం నమూనా మార్చి ఇస్తాం.. లేదంటే 15 రోజుల్లో డబ్బు తిరిగి చెల్లిస్తామంటూ శివ్‌కుమార్‌కు మెయిల్‌ పంపింది. ఇన్‌స్పిరాన్‌ 15 5503 ల్యాప్‌టాప్‌ నమూనాను పంపాలని 2021 జనవరిలో ఆయన సమాధానం ఇచ్చారు. సంస్థ ప్రతినిధి నమూనా స్పెసిఫికేషన్‌తో పాటు కొటేషన్‌ను పంపారు. అది వద్దని, ఇన్‌స్పిరాన్‌ నమూనానే ఇవ్వాలని లేదంటే.. పూర్తి మొత్తం వాపసు ఇవ్వాలని కోరారు.

Delay in Online Delivery : మొత్తం డబ్బులు చెల్లించినా ల్యాప్‌టాప్‌ డెలివరీ ఇవ్వలేదని, సేవల్లో లోపంగా పరిగణిస్తూ పరిహారం ఇప్పించాలంటూ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. లీగల్‌ నోటీసులు అందుకున్న ప్రతివాద సంస్థ వెంటనే ఆ డబ్బును శివ్‌కుమార్‌ ఖాతాలో జమ చేశారు. కేసును పరిశీలించిన హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-1 అధ్యక్షురాలు బి.ఉమా వెంకట సుబ్బలక్ష్మి ప్రతివాద సంస్థ తీరును తప్పుపట్టారు. వినియోగదారు వాదనతో ఏకీభవిస్తూ, 80 రోజులపాటు ఫిర్యాదీ అనుభవించిన మానసిక వేదనకు పరిహారంగా రూ.10 వేలు, కేసు ఖర్చులు రూ.10 వేలు చెల్లించాలని ప్రతివాద సంస్థను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details