Constable dismissal case victim: తనను బూచిగా చూపి అనంతపురం ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌ను విధుల నుంచి తొలగించారని ఆ కేసులో పోలీసులు బాధితురాలుగా పేర్కొంటున్న బి.లక్ష్మి తెలిపింది. ఈ ఏడాది జూన్ 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో జరిగిన సభకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకాగా, తమ బకాయిలు చెల్లించాలంటూ అదేరోజు అనంతపురంలో ప్లకార్డులు ప్రదర్శించిన కానిస్టేబుల్ ప్రకాశ్‌ను విధుల్లోంచి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. అదే జిల్లాలోని గార్లదిన్నెకు చెందిన మహిళ నుంచి ప్రకాశ్ బంగారం, డబ్బు తీసుకున్నారనే అభియోగంపై అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆదివారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. ఈ కేసులోని బాధితురాలు లక్ష్మి సోమవారం అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. ప్రకాశ్ తన నుంచి 30 తులాల బంగారం, రూ.10 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు మోపిన అభియోగంలో నిజం లేదని స్పష్టంచేశారు. కానిస్టేబుల్ తనను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, కక్ష సాధింపులో భాగంగానే తనను అడ్డం పెట్టుకుని ఆయనను తొలగించారని వాపోయింది.
తప్పుడు స్టేట్‌మెంట్ రాయించారు:‘నా భర్త, అతని కుటుంబసభ్యులు నన్ను వేధిస్తున్నారని నాలుగేళ్ల కిందట గార్లదిన్నె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అక్కడ న్యాయం జరగకపోవడంతో 2019లో ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వెళ్లాను అక్కడున్న సీఎం వలీ అనే కానిస్టేబుల్ నా ఫిర్యాదు రాస్తానని చెప్పి, నేను నా భర్త వేధింపుల గురించి చెప్తే ఆయన మరోలా రాశారు. కానిస్టేబుల్ ప్రకాశ్ నన్ను వేధిస్తున్నట్లు, అత్యాచారం చేసినట్లు, నా నుంచి డబ్బు, బంగారం తీసుకుని మోసం చేసినట్లుగా రాశారు. ఎస్పీ వెళ్లిపోతున్నారని తొందరపెట్టి స్టేట్‌మెంట్ చదివే అవకాశం ఇవ్వకుండానే నాతో సంతకం చేయించుకున్నారు. దాని ఆధారంగానే కేసు నమోదుచేసి, అప్పటి డీఎస్పీ వీరరాఘవరెడ్డి ప్రెస్‌మీట్ పెట్టారు.