Congress Dharna in Hyderabad : ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ పేరిట కేంద్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కేంద్ర సర్కార్ హస్తం పార్టీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రజాస్వామిక పద్ధతిలో ఈడీ.. సోనియా గాంధీని విచారిస్తోందని విమర్శించారు. ఈ విషయమంతా ప్రజలు గమనిస్తున్నారని.. త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని అన్నారు.
సోనియాపై ఈడీ కేసు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ నేతలు ధర్నాకు దిగారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్లదుస్తులు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. కొందరు నేతలు కార్యకర్తలు నల్ల రంగు బెలూన్లు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. దారి పొడవునా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు ర్యాలీ కొనసాగించారు. ర్యాలీ సందర్భంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ నాయకులు.. నిరసనలకు వెళ్లకుండా పోలీసులు అరెస్టు చేశారు.