తెలంగాణ

telangana

ETV Bharat / city

కాంగ్రెస్​లో గ్రేటర్​ హడావుడి.. 21న మేనిఫెస్టో!

బల్దియా ఎన్నికలకు కాంగ్రెస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఇటీవలె జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో మూడోస్థానానికే పరిమితమైన హస్తం పార్టీ.. ఈసారి ముందస్తు వ్యూహంతో కదులుతోంది. దుబ్బాక ఉపఎన్నికలో ఎదురైన పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుని గ్రేటర్‌ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతోంది.

GHMC ELECTIONS
కాంగ్రెస్​లో గ్రేటర్​ హడావుడి.. 21న మ్యానిఫెస్టో!

By

Published : Nov 17, 2020, 9:01 PM IST

కాంగ్రెస్​లో గ్రేటర్​ హడావుడి.. 21న మేనిఫెస్టో!

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడం వల్ల కాంగ్రెస్‌ పార్టీలో హడావుడి మొదలైంది. నగరంలోని 150 డివిజన్లకుగానూ ఇప్పటికే 40 నుంచి 50 డివిజన్లకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలోని అభ్యర్ధుల ఎంపిక, ఇతర అంశాల పర్యవేక్షణకు కమిటీలు వేశారు.

ఇప్పటికే కమిటీలు..

హైదరాబాద్‌ పార్లమెంటు సమన్వయకర్తగా సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీని, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను సమన్వయకర్తగా నియమించింది. చేవెళ్ల లోకసభ స్థానంలో సమన్వయం చేసే బాధ్యతలు పొన్నం ప్రభాకర్‌కు ఇచ్చిన పీసీసీ.. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ జీవన్​రెడ్డిని నియమించింది. మెదక్‌ బాధ్యతలను పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమకుమార్‌కు అప్పగించింది. ఈ కమిటీలే అభ్యర్ధులు ఎంపిక చేయాల్సి ఉంటుంది.

సకాలంలో అభ్యర్థులను ప్రకటించడం ద్వారా.. హైదరాబాద్‌ మహానగర పాలిక ఎన్నికల్లో అధికార తెరాసతోపాటు భాజపా, ఎంఐఎంలను.. దీటుగా ఎదుర్కొని ముందుకెళ్లేందుకు కాంగ్రెస్‌ తగిన కార్యాచరణ రూపకల్పన చేస్తోంది. 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకున్న కాంగ్రెస్‌.. ఈ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ముందుకు వెళ్తోంది.

ఘోర వైఫల్యాల నుంచి..

గత గ్రేటర్ ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘోర వైఫల్యాలు తిరిగి పునరావృతం కాకుండా తగుజాగ్రత్తలు తీసుకుంటూ కార్యచరణ రూపొందిస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా నియమితులైన మాణిక్కం ఠాగూర్‌ రాకతో.. కాంగ్రెస్‌ పార్టీలో కొంత కదలిక కనిపిస్తోంది. పార్టీ సీనియర్లను సైతం కలుపుకుని ముందుకెళ్లుతున్న ఆయన... అంతర్గత విబేధాలు లేవన్న భావనను తీసుకొచ్చారు. గెలుపోటములు పక్కన పెట్టి ఎవరికి వారు... వారికి అప్పగించిన పనిచేసేట్లు పార్టీ శ్రేణులను ప్రోత్సహిస్తున్నారు. అంతర్గత విబేధాలకు తావులేకుండా..బల్దియా ఎన్నికల్లో పనిచేయాలని ఇప్పటికే పార్టీ క్యాడర్‌కు పీసీసీ స్పష్టం చేసింది.

విస్తృత ప్రచారం..

బూతుస్థాయి వరకు ప్రతిస్థాయిలో ఇంఛార్జిలను నియమించి... విస్తృత ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రత్యర్థి పార్టీలపై.. ఎదురుదాడి చేయగలిగే సత్తా కలిగిన నాయకులను కొందరిని స్టార్‌ క్యాంపెయిన్లుగా నియమించాలని భావిస్తోంది. ఎంపీ రేవంత్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్‌ వంటి వారిని....నియమించే అవకాశం కనిపిస్తోంది.

గ్రేటర్‌లో ఓటరై.. పార్టీ విధేయులుగా ఉండి...పార్టీ కోసం పని చేసే ప్రజాదరణ కలిగిన వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ యోచిస్తోంది. గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను తొలుత ఈనెల 23న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ నోటిఫికేషన్ రావడంతో 21నే ప్రకటించేందుకు పీసీసీ సిద్ధమవుతోంది.

ఇవీచూడండి:గ్రేటర్ నగారా: డిసెంబరు 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details