జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బహిరంగంగా డబ్బు పంపిణీ జరుగుతోందని ఎస్ఈసీకి పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. బల్దియా పోలింగ్ పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు.
'పోలింగ్ కేంద్రాల వద్ద అధికార పార్టీ ఆధిపత్యాన్ని నిరోధించాలి'
బల్దియా ఎన్నికలు పారదర్శకంగా జరిగేట్లు చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నిర్భయంగా డబ్బు పంపిణీ జరుగుతోందని ఈ-మెయిల్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేసింది.
డబ్బు పంపిణీని నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఈ-మెయిల్ ద్వారా మర్రి శశిధర్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లతో పాటు సంగారెడ్డి ఎస్పీ కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి డబ్బు పంపిణీ అధికంగా జరిగే అవకాశం ఉందన్న శశిధర్ రెడ్డి.. సమర్థంగా నిరోధానికి చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.
పోలీసుల పెట్రోలింగ్‌తో పాటు మురికివాడల దగ్గర నిఘా పెంచాలని మర్రి శశిధర్ రెడ్డి ఈసీకి విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ అధికార పార్టీ నాయకుల ఆధిపత్యాన్ని నిరోధించేలా చూడాలని కోరారు.
- ఇదీ చూడండి :ఈటీవీ భారత్: అరచేతిలో బల్దియా పోలింగ్ అప్డేట్స్