భాగ్యనగరానికి సిన్హా.. స్వాగతం పలికిన కేసీఆర్, కేటీఆర్ - Yashwanth sinha campaign in hyderabad
11:36 July 02
హైదరాబాద్‌కు చేరుకున్న సిన్హా.. తెరాస భారీ ర్యాలీ
విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఇతర నేతలు సిన్హాకు ఘనస్వాగతం పలికారు. బేగంపేట నుంచి సిన్హా జలవిహార్ వరకు భారీగా ర్యాలీతో వెళ్లారు. జలవిహార్‌లో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహిస్తున్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రచారంలో పాల్గొనడానికి సిన్హా నగరానికి వచ్చారు.
సిన్హా రాకతో బేగంపేట ప్రాంగణమంతా గులాబీ మయమైంది. తెరాస శ్రేణులు ఎయిర్‌పోర్టుకు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివెళ్లారు. గులాబీ జెండాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. గోషామహల్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకుడు నంద కిషోర్ బిలాల్ వ్యాస్ ఆధ్వర్యంలో బేగంబజార్ నుంచి బేగంపేటకు ద్విచక్ర వాహనాలపై భారీగా తరలివెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు.