ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఆర్టీసీ అభివృద్ధి కోసం తానే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని ప్రకటించారు. ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేసి ఆర్టీసీని బతికించుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. సమష్టిగా కష్టపడి పోరాటం చేసి, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న స్ఫూర్తితోనే ఆర్టీసీని లాభాల బాటన నడిపించాలని కోరారు. సంస్థను బతికించడానికి ప్రభుత్వం తరుఫున చేయాల్సిందంతా చేస్తామని... ఇక అధికారులు, ఉద్యోగులు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.
వరాల జల్లులు ఇవే...
ప్రగతిభవన్ వేదికగా సీఎం కేసీఆర్ ఆర్టీసీ సంక్షేమ సభ్యులతో గంటన్నరసేపు మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబర్ నెల జీతాన్ని సోమవారం చెల్లిస్తామన్నారు. వీటితో పాటు పలు వరాలు ప్రకటించారు.
- సమ్మె కాలంలో వేతనం ఒకేసారి చెల్లింపు.
- ఆర్టీసీకి బడ్జెట్‌లో వెయ్యికోట్ల నిధుల కేటాయింపు.(వచ్చే ఏడాది నుంచి)
- పదవీవిరమణ వయసును 60 ఏళ్లకు పెంపు.
- ఆర్టీసీ అమరుల ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం.
- ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయలు ఆర్థికసాయం.
- ఉద్యోగుల తల్లిదండ్రులకు ఆసుపత్రి సేవలు, ఉచిత బస్సు పాసులు.
- ఉద్యోగుల పిల్లలకు బోధన రుసుముల సౌకర్యం.
- పీఎఫ్ బకాయిలు, సీసీఎస్ కు చెల్లించాల్సిన డబ్బుల చెల్లింపు.
- తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్.
- ఆర్టీసీ కార్మికుల గృహ నిర్మాణ పథకానికి రూపకల్పన.
- ఆర్టీసీలో పార్సిల్ సర్వీసులను ప్రారంభించేందుకు ప్రణాళికలు.
మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వరాలు..
మహిళా ఉద్యోగులకు రాత్రి విధులు వేయవద్దని అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతీ డిపోలో 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చిన్న పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగులకు ఖాకీ డ్రెస్ స్థానంలో వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్ వేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.