గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై కృష్ణా, గోదావరి బోర్డులు కసరత్తు చేస్తున్న వేళ నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా రెండో రోజు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో జరిగిన ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, అంతర్ రాష్ట్ర విభాగం ఇంజినీర్లతో సీఎం సమావేశమయ్యారు. మధ్యాహ్నం ప్రారంభమైన సమీక్ష అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా సాగింది. బోర్డుల సమావేశంలో రాష్ట్రం తరఫున వినిపించాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించారు.
మరికొన్ని లేఖలు రాసే అవకాశం..
గెజిట్ నోటిఫికేషన్‌కు సంబంధించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపును నిలువరించాలని కోరుతూ సమీక్ష కొనసాగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ పంపారు. ఇదే తరహాలో ఇటు బోర్డులు, అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించారు. బోర్డులు, కేంద్రానికి మరికొన్ని లేఖలు రాసే అవకాశం కనిపిస్తోంది.