విపత్తు సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చేయడం సహా, గ్రిడ్ ఫెయిల్ కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారని సీఎండీ ప్రభాకర్‌రావు, ఇతర సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు. ప్రగతి భవన్లో సోమవారం నిర్వహించిన సమీక్షలో విద్యుత్ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు.
కరీంనగర్ జిల్లాలో 220 కేవీ సామర్థ్యం కలిగిన ఏడు టవర్లు భారీ వరదల వల్ల కొట్టుకుపోయాయని సీఎంకు సీఎండీ ప్రభాకర్ వివరించారు. వరంగల్ జిల్లాలో రెండుచోట్ల 33 కేవీ సబ్స్టేషన్లు నీట మునిగాయన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో 54 గ్రామాలు నీట మునిగి ఉండడంతో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశామని సీఎంకు నివేదించారు.
వరద నీరు నిండిన ప్రాంతాలకు సంబంధించి ఎస్పీడీసీఎల్ పరిధిలో 159, ఎన్పీడీసీఎల్ పరిధిలో 89.. డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేశామన్నారు.
ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు ఉన్నందున అప్పర్, లోయర్ జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో మొత్తం 1200 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గినందున కేటీపీపీ, సింగరేణి, కేటీపీఎస్ తదితర ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించామని సీఎండీ ప్రభాకర్‌రావు వివరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో నమోదు కాని విధంగా తెలంగాణలో 13,168 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదయిందని కేసీఆర్ అన్నారు. ఇదే ఏడాది ఒక సందర్భంలో 4,200 మెగావాట్ల అత్యంత కనిష్ఠానికి డిమాండ్ పడిపోయిందని... సాధారణంగా ఇలాంటి పరిస్థితి తలెత్తితే గ్రిడ్ కుప్పకూలుతుందని సీఎం అన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆ పరిస్థితి తలెత్తకుండా చేశాయంటూ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.
ఇవీచూడండి:ఫ్లడ్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ తయారుకావాలి: కేసీఆర్