పురపాలక శాఖ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. హైదరాబాద్, వరంగల్‌తో పాటు రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించినా అధికారులు బాగా పనిచేశారంటూ ప్రశంసించారు. వర్షాలు, వరదలపై సమీక్షించిన సీఎం... వరంగల్‌లో తలెత్తిన పరిస్థితితో పాటు హైదరాబాద్, కరీంనగర్, ఇతర పట్టణ ప్రాంతాల పరిస్థితిని సమీక్షించారు.
పట్టణాల విషయంలో తీసుకున్న జాగ్రత్తలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వివరించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నగర, పురపాలికల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి ముంపునకు గురైన, ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించి ఆశ్రయం కల్పించినట్లు వివరించారు.
వరంగల్ నగరంలో 4,750 మందిని సహాయక శిబిరాలకు తరలించామని సీఎంకు నివేదించారు. రాష్ట్రంలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న 1,898 ఇళ్లను గుర్తించి, అందులో నివసిస్తున్న వారిని కూడా శిబిరాలకు తరలించామని కేటీఆర్ చెప్పారు. రెండేళ్ల క్రితం నుంచి హైదరాబాద్ నగరంలో విపత్తు స్పందన దళం పనిచేస్తోందని, అందులోని 339 మంది సుశిక్షితులైన సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి అవసరమైన చర్యలు చేపడుతున్నారని మంత్రి కేటీఆర్.. సీఎంకు తెలిపారు. పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ కలిగిన 50 వాహనాలు కూడా ఉంటాయని.... హైదరాబాద్ తరహాలోనే దళాలను వరంగల్, కరీంనగర్ లాంటి నగరాల్లోనూ ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.