తెలంగాణ

telangana

ETV Bharat / city

'కాళేశ్వరం ద్వారానే నేడు 35 లక్షల ఎకరాలకు సాగునీరు' - తెలంగాణ తాజా వార్తలు

వానాకాలం సీజన్ ప్రారంభం కాగానే తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి అన్ని జలాశయాలు, చెరువులు, చెక్ డ్యాంలను నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రోహిణికార్తె ప్రారంభంనుంచే రైతులకు నీరందించేందుకు సిద్ధంగాఉండాలని సూచించారు.మల్లన్నసాగర్‌లో మిగిలిన పనులను వేగవంతం చేయాలని... సింగూరు ఆయకట్టు కోసం తలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు వెంటనే డీపీఆర్​లను తయారు చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి సీతమ్మసాగర్ పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు.

cm kcr orders to irrigation officials to fulfill the vacancies in the department
'కాళేశ్వరం ద్వారానే నేడు 35 లక్షల ఎకరాలకు సాగునీరు'

By

Published : May 26, 2021, 3:52 AM IST

నీటిపారుదల శాఖలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండరాదని, ఎప్పటికప్పుడు అర్హులకు పదోన్నతులు ఇస్తూ వాటిని వెంటవెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. కాల్వల నిర్వహణ కోసం త్వరలో లష్కర్లు, జేఈల నియామకాన్ని చేపడతామని తెలిపారు. ప్రత్యేకావసరాల దృష్ట్యా బోర్డు ద్వారా సొంతంగా నియామకాలను జరుపుకొనే విధానాన్ని అమలు చేస్తామన్నారు. కింది నుంచి పైస్థాయి దాకా ఖాళీల నివేదికను వెంటనే అందజేయాలని ఆదేశించారు. కృష్ణా, గోదావరి నదుల మీద నిర్మిస్తున్న ఎత్తిపోతలు, ప్రాజెక్టుల పురోగతి, కాల్వల మరమ్మతులు తదితర సాగునీటి అంశాలపై మంగళవారం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో దేవరకొండ నుంచి కోదాడ వరకు నిర్మించతలపెట్టిన 15 ఎత్తిపోతల పథకాలకు త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఎత్తిపోతలు, కాల్వల నిర్మాణం, పంపుల ఏర్పాటు తదితరాలన్నింటికి వ్యయ అంచనాలను జూన్‌ 15కు పూర్తి చేసి, టెండర్లకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ఏ లిప్టుకు ఆ లిప్టు ప్రకారం అంచనాలను వేర్వేరుగా తయారు చేస్తే ఒకేసారి టెండర్లు పిలుస్తామన్నారు. టెండర్లకు సంబంధించిన సమన్వయ బాధ్యతలను మంత్రి జగదీశ్‌రెడ్డి తీసుకోవాలన్నారు.


నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఇటీవల శంకుస్థాపన చేసిన నెల్లికల్లు లిఫ్టు సామర్థ్యం 24 వేల ఎకరాలకు పెంచినందున పాత టెండరు రద్దుచేసి కొత్తగా వారం రోజుల్లో పిలవాలని ఆదేశించారు. వానాకాలం సీజన్‌ ప్రారంభం కాగానే కాళేశ్వరం నీటిని ఎత్తిపోసి తుంగతుర్తి దాకా అన్ని చెరువులను, రిజర్వాయర్లను, చెక్‌ డ్యాములను నింపాలని సీఎం సూచించారు. రూ. నాలుగు వేల కోట్లు పెట్టి నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల మొదటి దశను జూన్‌కు పూర్తి చేయాలన్నారు. కాళేశ్వరంలో మీట ఒత్తితే చివరి ఆయకట్టు దాకా నీరు నిరాటంకంగా పొలాలకు చేరేలా సర్వం సిద్ధం చేయాలని సీఎం అన్నారు. సాగునీరు, వ్యవసాయం సహా అన్ని రంగాల్లో తెలంగాణ స్వరూపం పూర్తిగా మారినందున అధికారులు పనివిధానాన్ని మార్చుకోవాలని, మరమ్మతులు, నిర్వహణపై జూన్‌ మొదటి వారంలో ఇంజినీర్ల వర్క్‌షాప్‌ నిర్వహించాలని, పనుల ప్రతిపాదనలను రూపొందించే ముందు జాగ్రత్తగా అంచనాలు తయారు చేయాలని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ, మరమ్మతులకు నిధులను నీటిపారుదలశాఖ కార్యదర్శి అధీనంలో ఉంచుతామన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ‘ఎల్లంపల్లి నుంచి దుమ్ముగూడెం దాకా అక్టోబరు నెలాఖరు వరకు నీటి లభ్యత ఉంటుంది. ప్రాణహిత ప్రవాహం జూన్‌ 20 తర్వాత ఉద్ధృతంగా మారుతుంది. వచ్చిన నీటిని వచ్చినట్టే ఎత్తిపోసి కాళేశ్వరం ఆయకట్టులోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను నింపుకోవాలి. కృష్ణా బేసిన్‌లో కూడా ఇదే విధానాన్ని అనుసరించాలి. తాగునీటికి లోటు రాకూడదు.

వరంగల్‌ ఉమ్మడి జిల్లాకే దేవాదుల
ఎస్సారెస్పీ పునరుజ్జీవనం ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి చివరి ఆయకట్టు దాకా నీటికొరత లేదు. హుస్నాబాద్‌, పాత మెదక్‌, ఆలేరు, భువనగిరి, జనగామలకు మల్లన్నసాగర్‌ నీరు చేరుతోంది. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లా బంగారు తునకగా మారుతుంది. దేవాదుల ప్రాజెక్టును వరంగల్‌ జిల్లాకే అంకితం చేస్తాం. మిగతా జిల్లాల్లోనూ కృష్ణా, గోదావరి బేసిన్లలో సాగునీటినందించే ప్రాజెక్టుల నిర్వహణ వ్యూహాన్ని ఖరారు చేస్తాం. కాల్వల మరమ్మతు తదితర అవసరాలకు రూ. 700 కోట్లు కేటాయించాం.

క్వార్టర్ల నిర్మాణం


మేజర్‌ లిఫ్టులు, పంపులు ఉన్నచోట స్టాఫ్‌ క్వార్టర్ల నిర్మాణం చేపట్టి, తక్షణమే పూర్తి చేయాలి. కాంట్రాక్టర్ల క్యాంపుల కోసం భూసేకరణ నిలిపివేయాలి. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం మూడో పంప్‌హౌజ్‌ పనులు సత్వరమే పూర్తి చేయాలి, సదర్‌మాట్‌ బ్యారేజీ నిర్మాణం పనుల పురోగతితో పాటు ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రాజెక్టులపై నివేదిక ఇవ్వాలి. మంచిర్యాల, కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు నీరందించేందుకు లిఫ్టులకు ఆయకట్టు సర్వే కోసం వాప్కోస్‌తో సంప్రదింపులు జరపాలి. సమ్మక్క సారక్క బ్యారేజీ నిర్మాణం పూర్తయినందున సాంకేతిక బృందాన్ని పంపి నిర్వహణపై ఇంజినీర్లకు శిక్షణ ఇవ్వాలి. మైలారం ట్యాంకు నుంచి సూర్యాపేట తుంగతుర్తి దిక్కుగా కాళేశ్వరం నీటిని తీసుకపోయే డీబీఎం 71 కాల్వ లైనింగ్‌ చేపట్టాలి. హల్దీవాగు ప్రాజెక్టు కాల్వ అధునికీకరణ పనులను చేపట్టి 7 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలి, సంగారెడ్డి జిల్లాలోని సంగమేశ్వర లిఫ్టు, బసవేశ్వర లిఫ్టులపై సత్వరం డీపీఆర్‌లు తయారు చేయాలి. వచ్చే ఏడాది జూన్‌ కల్లా సీతమ్మ సాగర్‌ నిర్మాణం పూర్తిచేయాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, హన్మంత్‌షిండే, సైదిరెడ్డి, నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎంవో కార్యదర్శి స్మితాసభర్వాల్‌, నీటిపారుదల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:జూన్ 1 నుంచి ఇంటర్​ మొదటి సంవత్సరం ఆన్​లైన్ తరగతులు

ABOUT THE AUTHOR

...view details