కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (kaleshwaram project) అదనపు టీఎంసీ పనిలో సొరంగం వద్దని సూచించినా మళ్లీ ఎందుకు ప్రతిపాదించారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజినీర్లను ప్రశ్నించినట్లు తెలిసింది. ఎల్లంపల్లి(yellampalli project) నుంచి మధ్యమానేరు వరకు అదనంగా మరో టీఎంసీ నీటిని మళ్లించే పనులను గత ఏడాది ప్రభుత్వం చేపట్టింది. డిజైన్ల ఖరారీ దశలో అప్రోచ్ ఛానల్ సొరంగం కాకుండా కాలువ చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. కొత్తగా చేపట్టే పనుల్లో వీలైనంతవరకు సొరంగం లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని గతంలోనే ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. డీప్‌కట్ ఉండటంతో పాటు 530 ఎకరాల భూమిని సేకరించాల్సి రావడంతో ఇంజినీర్లు సొరంగమార్గాన్ని (tunnel) ప్రతిపాదించి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అయితే సొరంగ మార్గం వద్దని చెప్పినా చేపట్టడం, ఈ విషయాన్ని తన దృష్టికి తేకపోవడం గురించి ఈ ప్రాజెక్టు ఉన్నతస్థాయి ఇంజినీర్లపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. భూసేకరణ, అప్రోచ్‌ఛానల్ నిర్మాణంలో ఉన్న సమస్యలను పరిగణనలోకి తీసుకొని చేపట్టామని, దీనివల్ల నిర్మాణ వ్యయం సుమారు రూ.110 కోట్లు తగ్గుతుందని సంబంధిత ఇంజినీర్లు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది.
kaleshwaram: ఇంజినీర్లపై సీఎం ఆగ్రహం.. సొరంగ ప్రతిపాదనపై అసహనం
కాళేశ్వరం ప్రాజెక్టు(kaleshwaram project) ఉన్నతస్థాయి ఇంజినీర్లపై సీఎం కేసీఆర్(cm kcr) ఆగ్రహం వ్యక్తం చేశారు. సొరంగం వద్దని సూచించినా మళ్లీ ఎందుకు ప్రతిపాదించారని ప్రశ్నించారు. డిజైన్ల ఖరారీ దశలో అప్రోచ్ ఛానల్ సొరంగం కాకుండా కాలువ చేపట్టాలని సూచించారు.
శ్రీరామసాగర్ పునరుజ్జీవ పథకం(sriram sagar project)లో పెరిగిన అంచనాలను ఈ నెల 30న జరిగే మంత్రివర్గ సమావేశానికి సమర్పించనున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించే నీటి నుంచి శ్రీరామసాగర్‌కు రోజుకు ఒక టీఎంసీ నీటిని తీసుకొనేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. రూ.1,067 కోట్లతో మొదట పరిపాలనా అనుమతి ఇవ్వగా తర్వాత రూ.1,751 కోట్లకు సవరించారు. తాజాగా ఈ పని విలువ రూ.1,999 కోట్లకు పెరిగింది. ఈ పని కోసం ఆరుచోట్ల వరదకాలువను కట్ చేసి, బ్రిడ్జిలు కట్టాల్సి వస్తోందని, ధరలు, జీఎస్టీ వంటివి కూడా పెరిగాయని ఇటీవల జరిగిన సమావేశంలో ఇంజినీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీనికి ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో గుత్తేదారుకు రూ.170 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని నివేదించారు. పనిలో జాప్యం తదితర అంశాలపై చర్చించిన తర్వాత మంత్రివర్గం ముందు పెట్టి పెరిగిన అంచనాకు ఆమోదం తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. దీంతో ఈ నెల 30న జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు ఈ అంశాన్ని తెచ్చేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది.