తెలంగాణ

telangana

ETV Bharat / city

'వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కిందకి వచ్చేలా చర్యలు' - ముఖ్యమంత్రి వైఎస్ జగన్

CM Jagan Review: ఆరోగ్య శ్రీలో అవసరమైన మేరకు చికిత్సా విధానాల సంఖ్యను పెంచాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే.. ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం అందే దిశగా అడుగులు వేయాలన్నారు. అంబులెన్సుల్లో అవినీతికి(లంచాలకు) ఆస్కారం ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వ ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో అవసరమైన ఏర్పాటు, సిబ్బందిని భర్తీ చేయాలని.. జులై 26 నాటికల్లా ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశించారు.

'వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కిందకి వచ్చేలా చర్యలు'
'వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కిందకి వచ్చేలా చర్యలు'

By

Published : Jun 28, 2022, 7:11 PM IST

CM Jagan Review on Health: ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు, ఆరోగ్యశ్రీపై సీఎం సమీక్షించారు. ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ప్రత్యేక ఖాతాలను తెరవాలని, దాని కింద అందించే డబ్బును నేరుగా ఈ ఖాతాకు పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా వైద్యం అందించిన ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ఈ మేరకు కన్సెంట్‌ పత్రాన్ని పేషెంట్ ‌నుంచి తీసుకోవాలన్నారు. తన వ్యక్తిగత ఖాతా విషయంలో ఎలాంటి సందేహాలు, భయాందోళనలు లేకుండా ఈ ప్రత్యేక అకౌంట్‌ ఉపయోగపడుతుందన్నారు. ఈ విధానాల వల్ల మరింత జవాబుదారీతనం, పారదర్శకత వస్తుందన్నారు. రోగిపై అదనపు భారాన్ని వేయకుండా.. వారికి పూర్తిగా ఉచితంగా వైద్య సేవలందే పరిస్థితి వస్తుందన్నారు. ఆరోగ్య మిత్రలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వైద్య సేవలకు ప్రభుత్వం మొత్తం చెల్లిస్తుందని.. దీనికి అదనంగా డబ్బు వసూలు చేసే పరిస్థితి ఉండకూడదన్నారు. ఒకవేళ ఎవరైనా అదనంగా డబ్బులు వసూలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామన్న సంకేతం వెళ్లాలన్నారు. అదనంగా తన వద్ద నుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదన్న కన్ఫర్మేషన్‌ పేషెంట్‌ నుంచి తీసుకోవాలన్నారు. ఆరోగ్య మిత్రలు క్రియాశీలకంగా వ్యవహరించేలా చూడాలని, పేషెంట్‌ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జీ అయ్యేంత వరకూ వారికి అండగా, తోడుగా నిలవాలన్నారు. పేషెంట్‌ ఇంటికి వెళ్లిన తర్వాత ఆరోగ్య కార్యకర్త ఆ ఇంటికి వెళ్లి బాగోగులు చూడాలన్నారు.

వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కిందకి వచ్చేలా:ఆరోగ్య శ్రీలో అవసరమైన మేరకు చికిత్సా విధానాల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పుడున్న 2,436 చికిత్సలను ఇంకా పెంచాలని సూచించారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే.. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందే దిశగా అడుగులు వేయాలన్నారు. ఆరోగ్య శ్రీకి పేషెంట్లను రిఫర్‌ చేసే విధానం బలోపేతంగా ఉండాలని, విలేజ్‌ క్లినిక్స్‌లో రిఫరల్‌ కోసం పర్మినెంట్‌ ప్లేస్‌ను డిజైన్‌ చేయాలని.. ఇవే రిఫరల్‌ కేంద్రాలుగా పని చేస్తాయన్నారు. పథకం ద్వారా అందిన లబ్ధిని తెలియజేయాలన్నారు. ఆరోగ్య ఆసరా డబ్బు నేరుగా వారి వ్యక్తిగత ఖాతాకు డీబీటీ విధానంలో చేస్తున్న పద్ధతిని కొనసాగించాలన్నారు. 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లలో లంచాలకు ఆస్కారం ఉండకూడదన్న సీఎం.. లంచం అడిగే పరిస్థితులు లేకుండా ఎస్‌వోపీలు ఉండాలన్నారు. లంచం అడిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలన్న నంబర్లను అవే వాహనాలపై ఉంచాలన్నారు.

జులై 26 నాటికల్లా ప్రక్రియ పూర్తి కావాలి:ప్రభుత్వ ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో ఖాళీల భర్తీ, ప్రమాణాలకు అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖలో సిబ్బంది నియామకంపై సీఎం సమీక్షించారు. ఎక్కడా సిబ్బంది కొరత ఉండకూడదని, ఏ కారణం వల్ల అయినా పోస్టులు ఖాళీ అయితే వెంటనే వాటిని భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. పదవీ విరమణ చేసిన వైద్యులు, ఆ రంగంలోని రిటైర్డ్‌ సీనియర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. అవసరమైతే వారి పదవీ విరమణ వయస్సును పెంచే ఆలోచన చేయాలన్నారు. జులై 26 నాటికల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఈ మొత్తం ప్రక్రియ ముగియాలని సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో 40,188 పోస్టులు భర్తీ చేశామని.. ఇంకా 1,132 మంది భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వివరించారు. 176 పీహెచ్‌సీల నిర్మాణం పూర్తి కాగానే.. వీటిలో 2072 పోస్టులు కూడా భర్తీ చేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

కళ్లు చెదిరే ఇంటీరియర్​.. అదిరిపోయే ఇన్​ఫ్రాస్ట్రక్చర్​.. టీ-హబ్ లోపల చూస్తే మైండ్​ బ్లాంకే..!

'సిల్క్​ స్మితతో అందుకే గొడవ.. బాలయ్యతో షూటింగ్ జరుగుతుండగా...'

ABOUT THE AUTHOR

...view details