CM Jagan meet PM: దిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. సుమారు గంటసేపు ప్రధాని నివాసంలో ఉన్న జగన్.. పలు అంశాలపై చర్చించారు. ఏపీ సమస్యలపై ప్రధానికి వినతిపత్రం అందజేశారు. విభజన హామీలు నెరవేర్చాలని మోదీని కోరారు. విభజన వల్ల ఏపీ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిందని.. ప్రధానికి జగన్ వివరించారు. ప్రత్యేక హోదా ఇస్తే చాలావరకు ఊరట కలుగుతుందన్నారు.
విభజన వేళ ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని.. సీఎం జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పెరిగిన అంచనాల మేరకు పోలవరం నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
"2017–18 ధరల ప్రకారం.. పోలవరం అంచనా వ్యయం రూ.55,657 కోట్లుగా నిర్ణయించాలి. పోలవరానికి ఖర్చు చేసిన రూ.2,100 కోట్ల బిల్లులు ఇవ్వాలి. తెలంగాణ నుంచి రూ.6,284 కోట్ల విద్యుత్ బిల్లులు వచ్చేలా చూడాలి. కరోనా కష్టాల్లో ఉన్నప్పుడు రుణపరిమితిలో కోత సరికాదు. కోతల వల్ల ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది. ఎన్‌బీసీ- నెట్ బారోయింగ్ సీలింగ్ రూ.42,472 కోట్లుగా చేసి అప్పులకు వెసులుబాటు ఇవ్వాలి. భోగాపురం విమానాశ్రయ సైట్ క్లియరెన్స్ అప్రూవల్ రెన్యువల్ చేయాలి. కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌పై త్వరగా నివేదిక వచ్చేలా చూడాలి." అని సీఎం జగన్ ప్రధానిని కోరారు. ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని గనులశాఖకు విజ్ఞప్తి చేశామని సీఎం జగన్ వెల్లడించారు. కీలకమైన గనుల కేటాయింపుపై జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు.