ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని కోరారు. ప్లాంటును బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్కు పరిశ్రమ ద్వారా 20 వేలమంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని.. పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
‘విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు’ నినాదంతో ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పడిందని వివరించారు. దశాబ్దం పాటు ప్రజలు పోరాటం చేశారని, నాటి ఉద్యమంలో 32మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. 2002-15 మధ్య వైజాగ్ స్టీల్ మంచి పనితీరు కనబరిచిందన్నారు. ఈ ప్లాంటు పరిధిలో 19,700 ఎకరాల భూములు ఉన్నాయని.. వాటి విలువే దాదాపు రూ.లక్ష కోట్లు ఉంటుందని వివరించారు. ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరగడం వల్ల ప్లాంటుకు కష్టాలు వచ్చాయని చెప్పారు. స్టీల్ ప్లాంటుకు సొంతంగా గనుల్లేవని సీఎం ఈ సందర్భంగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.