తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లో ఉండాలి: ఏపీ సీఎం జగన్ - ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లో ఉండాలి

ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లో ఉండాలని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మంగళవారం.. వైకాపా శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

ap cm jagan
ap cm jagan

By

Published : Mar 16, 2022, 7:23 AM IST

'వచ్చే రెండేళ్లూ పరీక్షా సమయం.. ఎవరి పనితీరు బాగా లేకపోయినా ఏ మాత్రం ఉపేక్షించబోను’ అని వైకాపా ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ‘ఇంటింటికీ తిరగాలి. మీ పని తీరును కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం. పార్టీ మళ్లీ గెలవడమే అత్యంత ప్రధానం. జుట్టు ఉంటే ఎలాగైనా ముడివేసుకోవచ్చు. జుట్టే లేకపోతే ముడి ఎలా వేసుకునేది? పనితీరు బాగాలేదని సర్వేల్లో తేలిన వారికి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదు. అధికారంలోకొచ్చి మూడేళ్లయింది. ఇక వచ్చే రెండేళ్లలో మీ పనితీరును బట్టే పార్టీ మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తుందా.. లేదా అనేది ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో నిర్వహించిన వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో జగన్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు రావడం కాదు.. మనమే వెళ్లాలి

‘‘ఇక నుంచి పార్టీపరంగా మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలి. నా అనుభవంతో చెబుతున్నా, గడప-గడపకూ కార్యక్రమం కంటే గొప్పది మరొకటి ఉండదు. ఎమ్మెల్యేగా గెలవాలంటే మూడుసార్లయినా గడప-గడపకూ వెళ్లాలి. లేకపోతే ఎంత మంచి ఎమ్మెల్యే అయినా గెలవడం ప్రశ్నార్థకమే. ప్రజలు మన ఇళ్లకు వచ్చి మనల్ని కలవడం కాదు.. మనమే గ్రామాల్లోకి వెళ్లాలి. ఉగాది నుంచి నెల రోజులపాటు వాలంటీర్ల సన్మాన కార్యక్రమం చేపడుతున్నాం. ఎమ్మెల్యేలు ప్రతి గ్రామానికీ వెళ్లి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో వారికి ప్రభుత్వం నుంచి ఏమేం మేలు అందిందనే వివరాలతో నేను రాసిన లేఖను స్వయంగా ఇచ్చి వారి ఆశీస్సులు పొందాలి. అదే సమయంలో పార్టీ సంస్థాగతంగా బూత్‌, గ్రామ కమిటీలను వేయాలి.

- ఏపీ సీఎం జగన్‌

ఏప్రిల్‌ 10లోగా బిల్లుల చెల్లింపు

ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లేలోపు పెండింగు బకాయిలను చెల్లిస్తాం. గ్రామ స్థాయిల్లో ఉపాధి హామీ పథకం సహా అన్ని పనుల బిల్లులనూ ఏప్రిల్‌ 10లోగా చెల్లిస్తాం. పట్టణాలు, నగరాల్లోని పనుల బిల్లులనూ చెల్లిస్తాం. మీరు వెళ్లినప్పుడు ఆ బిల్లుల గురించి అడిగే పరిస్థితి రాదు.

- ఏపీ సీఎం జగన్‌

మే నెలలో గడప-గడపకు..

"మే నెలలో గడప-గడపకు వైకాపా కార్యక్రమాన్ని చేపట్టాలి. ఆలోగా బూత్‌, గ్రామ కమిటీల నుంచి మండల, జిల్లాస్థాయి కమిటీల వరకు పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేయాలి. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు మూడు-నాలుగు జిల్లాలకు ఒక ప్రాంతీయ బాధ్యుడిని నియమిస్తాం. ఎమ్మెల్యేల పనితీరునూ వారు పరిశీలిస్తారు. మే నుంచి నెలలో 10కి తగ్గకుండా సచివాలయాలను సందర్శించాలి. జులై 8న పార్టీ ప్లీనరీ నిర్వహిస్తాం’’ అని ముఖ్యమంత్రి జగన్​ వెల్లడించారు.

వెనక కూర్చోవడం అలవాటు చేసుకుంటున్నాం

సమావేశ హాలులోకి ముఖ్యమంత్రి ప్రవేశించే సమయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చుని ఉన్నారు. మంత్రులు వెలంపల్లి, పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు, సురేష్‌, అనిల్‌, బుగ్గన తదితరులు వెనుక వరుసల్లో కూర్చోవడం చూసి ‘ఏం.. మంత్రులు వెనుక కూర్చున్నారు’ అని సీఎం అడగ్గా.. ‘వెనక కూర్చోవడం అలవాటు చేసుకుంటున్నాం’ అని ఒక మంత్రి సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశంలో పాల్గొన్నారు.

- ఏపీ సీఎం జగన్‌

త్వరలోనే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ

మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల తర్వాత మారుస్తామని మొదటి శాసనసభాపక్ష సమావేశంలోనే చెప్పాం. అతి త్వరలోనే చేయబోతున్నాం. ఒకటి రెండు చోట్ల మినహాయింపులు ఉంటాయిగానీ, మిగతా వారంతా మారతారు. మంత్రులను పక్కన పెడుతున్నామని అర్థం కాదు. వారిని జిల్లా పార్టీ అధ్యక్షులుగా, ప్రాంతీయ సమన్వయ కర్తలుగా తగిన బాధ్యతలు అప్పగిస్తాం. రాష్ట్రంలో 26 జిల్లాలు కాబోతున్నాయి.. వీటిలో 3-4 జిల్లాలకు ఒకరి చొప్పున 8 మంది ప్రాంతీయ సమన్వయకర్తలను నియమిస్తాం.

- ఏపీ సీఎం జగన్‌

ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లో ఉండాలి: ఏపీ సీఎం జగన్

ఇదీచూడండి:CM KCR Statements: వీఆర్​ఏలు, ఫీల్డ్​ అసిస్టెంట్లకు గుడ్​న్యూస్​.. అసెంబ్లీలో సీఎం ప్రకటన..

ABOUT THE AUTHOR

...view details