CLP Bhatti on Budget 2022 : శాసనసభ బడ్జెట్ సమావేశాలు 2022-23 చివరి రోజున ద్రవ్యవినిమియ బిల్లుపై జరిగిన చర్చలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క మాట్లాడారు. 2021-22 నాటికి రూ.6వేల కోట్లు మాత్రమే పన్నేతర ఆదాయం వస్తే.. రూ.30వేల కోట్లు వచ్చినట్లు చూపారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సవరించిన అంచనాల్లో రూ.20వేల కోట్లుగా చూపారని.. ఈ ఏడాది పన్నేతర ఆదాయాన్ని రూ.25,421 కోట్లుగా చూపినట్లు తెలిపారు. రాని ఆదాయాన్ని పెద్దమొత్తంలో బడ్జెట్‌లో చూపుతున్నారని భట్టి మండిపడ్డారు. పద్దు భారీగా పెంచుకునేందుకు లెక్కలు ఉపయోగపడతాయి కానీ.. పెంచిన బడ్జెట్‌తో లక్ష్యాలు సాధించలేమని గుర్తించాలని అన్నారు.
Telangana Budget Sessions 2022 : "సహాయక గ్రాంట్లు రూ.41 వేల కోట్లుగా చూపారు. కేంద్రం నుంచి సహాయక గ్రాంట్లు గరిష్ఠంగా రూ.15 వేల కోట్లు వస్తాయి. పన్ను ఆదాయాల్లోనూ చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. 2021-22లో పన్ను ఆదాయాన్ని రూ.1.76 లక్షల కోట్లుగా చూపారు. సవరించిన పన్ను ఆదాయం రూ.1.56 లక్షల కోట్లుగా చూపారు. వాస్తవానికి పన్ను ఆదాయం రూ.1.25 లక్షల కోట్లు దాటదని భావిస్తున్నాను. పన్ను, పన్నేతర ఆదాయాలు, సహాయక గ్రాంట్లను భారీగా చూపించారు."
- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత