తెలంగాణ

telangana

ETV Bharat / city

ముస్తాబైన తిరుమల.. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ - vaikunta ekadashi

CJI at tirumala:వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుమల ముస్తాబైంది. అర్ధరాత్రి తరువాత వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు తిరుమల శ్రీవారిని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు. ఈ సందర్బంగా ఆయన తిరుమలకు చేరుకున్నారు.

ముస్తాబైన తిరుమల.. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
ముస్తాబైన తిరుమల.. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

By

Published : Jan 12, 2022, 10:06 PM IST

CJI at tirumala: వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుమల ముస్తాబైంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహం వద్ద సీజేఐకి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. రేపు సీజేఐ.. శ్రీవారిని దర్శించుకోనున్నారు. పద్మావతి అతిథి గృహంలో జస్టిస్ ఎన్వీ రమణను భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా కలిశారు.

సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణకు ఘన స్వాగతం

తితిదే విస్తృత ఏర్పాట్లు

vaikunta ekadashi: తిరుమలలో అర్ధరాత్రి తరువాత వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. ధనుర్మాస కైంకర్యాలను నిర్వహించి గురువారం వేకువజామున 1.45 గంటల నుంచి వైకుంఠద్వార దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. గురువారం నుంచి పది రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు. సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం, వర్చువల్‌ అర్జిత సేవా టికెట్ల దర్శనం ఇలా రోజుకు 45వేల మంది శ్రీవారిని దర్శించుకోనున్నారు. కరోనా నియంత్రణ, భక్తుల రద్దీ దృష్ట్యా సిఫార్సు దర్శనాలను ప్రముఖులు స్వయంగా వస్తేనే టికెట్లు కేటాయిస్తామని ప్రకటించిన తితిదే... ప్రముఖులకు గదులు, దర్శన టికెట్ల కేటాయింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

శ్రీరంగంలో మాదిరిగా 10రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడంతో పాటు వైకుంఠ ద్వార ప్రవేశం పొందేందుకు ప్రముఖులతో పాటు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. గతంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే వైకుంఠద్వార ప్రవేశ దర్శనానికి అవకాశం ఉండగా.. గడిచిన రెండు సంవత్సరాలుగా పది రోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశానికి తితిదే అవకాశం కల్పిస్తోంది. గతేడాది నుంచి ఆగమ పండితులు, అర్చకుల సూచనలతో శ్రీరంగం దేవస్థానం తరహాలో తిరుమలలో కూడా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు.

ప్రముఖల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

కరోనా ప్రభావంతో గతేడాది నుంచి పరిమిత సంఖ్యలో భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. వైకుంఠ ద్వార ప్రవేశానికి 10 రోజులకు సంబంధించి రోజుకు 20వేల టికెట్లు చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, 5వేల చొప్పున టైమ్‌ స్లాట్‌ సర్వదర్శన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా కేటాయించారు. స్థానికుల కోసం మరో 5వేల టికెట్లను కరెంట్‌ బుకింగ్‌ ద్వారా తిరుపతిలోని కేంద్రాల ద్వారా జారీ చేశారు. దీంతో పాటు శ్రీవాణి ట్రస్టు ద్వారా 2వేలు, వర్చువల్‌ సేవాటికెట్ల కింద మరో 5,500 దర్శన టికెట్లను విక్రయించారు. ఏకాదశి పర్వదినాన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులు, సాధారణ భక్తులకు వేర్వేరుగా వసతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. పద్మావతినగర్‌ విచారణ కార్యాలయం వద్ద మంత్రులు, న్యాయమూర్తులకు.. గదులు, దర్శన టికెట్లను కేటాయించేందుకు ఏర్పాట్లు చేశారు. సన్నిధానం వద్ద తితిదే ఛైర్మన్‌, బోర్డు సభ్యులకు వసతుల కల్పన, నందకం, వకుళామాత భవనాల వద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్‌లకు గదులు కేటాయిస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు పలువురు న్యాయాధికారులు, రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు తిరుమల చేరుకున్నారు.

నాలుగు టన్నుల పూలతో సుందరంగా అలంకరణ

అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకు వైకుంఠ ద్వారాలను తెరవనున్నారు. అనంతరం ధునుర్మాస కైంకర్యాలతో పాటు, స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం వేకువ జామున 1.45 నిమిషాల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ప్రముఖులకు దర్శనం పూర్తయిన తర్వాత సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. నేరుగా వచ్చే ప్రముఖులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తుండగా.. సిఫారసు లేఖలు నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. ఏకాదశి పురస్కరించుకుని గురువారం ఉదయం 9గంటలకు స్వామివారు స్వర్ణరథంపై దర్శనమివ్వనున్నారు. ద్వాదశి సందర్భంగా శుక్రవారం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. ఆలయంతో పాటు వైకుంఠ ద్వారాన్ని నాలుగు టన్నుల పూలతో సుందరంగా అలంకరించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details